Begin typing your search above and press return to search.

ఐక్య రాజ్యసమితి పాత్ర ఏమిటి : యుద్ధం శరణం గత్యామీ !

లేటెస్ట్ గా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో కూడా ఐక్య రాజ్య సమితి శాంతి వచనాలు చెబుతోంది అని విమర్శలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   12 Oct 2023 2:45 AM GMT
ఐక్య రాజ్యసమితి పాత్ర ఏమిటి : యుద్ధం శరణం గత్యామీ !
X

ప్రపంచ దేశాలు ఇపుడు అశాంతి యుద్ధం నడుమ చిక్కుకుని పోతున్నాయి. ఏ దేశానికి కోపం వస్తే ఆ దేశం ఆయుధం పడుతోంది. పక్కన ఉన్న దేశం చిన్నదా పెద్దదా అన్నది చూడడంలేదు. మారణ హోమమే రగులుకుంటోంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పటైన సంస్థ ఇది. ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న సంస్థ.

అది సరిగ్గా 1945 అక్టోబర్ 24న ఏర్పాటు అయింది. అంటే మరో 22 ఏళ్లలో వందేళ్ళు పూర్తి అవుతాయన్న మాట. ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం వెనక ఉద్దేశ్యాలు ఏంటి అన్నది చూస్తే కనుక అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించడం, అలాగే ప్రపచభద్రత, ప్రపచ ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి ప్రపంచ మానవ హక్కులపై సమష్టిగా కృషి చేయడం వంటి ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి.

ఇలా ప్రపంచ దేశాలకు ఒక మధ్యవర్తిగా పెద్ద మనిషిగా ఏర్పాటు అయిన ఐక్య రాజ్యసమితి లో ఈ రోజుకు చూస్తే 193 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. ఇలా ప్రపంచం అంతా ఐక్య రాజ్యసమితి గొడుగు నీడకు వచ్చిన తరువాత అనుకున్న లక్ష్యాలు నెరవేరుతున్నాయా అన్న చర్చ అయితే వస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. ఇప్పటికీ ఆగకుండా సాగుతూనే ఉంది.

ఐక్య రాజ్యసమితి మధ్యవర్తిత్వం చేసినా కూడా యుద్ధం ఆగలేదు. ఇపుడు చూస్తే ఇజ్రాయెల్ హమాస్ అనే ఉగ్ర సంస్థతో పోరాడుతోంది. హమాస్ వెనక పాలస్తీనా ఉంది. ఇలా రెండు దేశాల మధ్య గత ఎనభై ఏళ్ళుగా యుద్ధం రావణ కాష్టంగా సాగుతున్నా ఐక్య రాజ్యసమితి ఏ రాజీనీ కుదర్చలేకపోయింది అనే అంటున్నారు.

భారత్ విషయానికి వస్తే కాశ్మీర్ ఇష్యూ ఏడున్నర దశాబ్దాలుగా పాకిస్థాన్ ఇండియా మధ్య రగులుతూనే ఉంది. తొలి ప్రధాని నెహ్రూ మూడవ వంతు భూభాగం కాశ్మీర్ కి చెందినది పాక్ ఆక్రమించినది అని ఐక్య రాజ్య సమితి ఫిర్యాదు చేశారు. ఈ రోజుకీ ఆ భూభాగం పాకిస్తాన్ వద్దనే ఉంది. భారత్ ప్రచ్చన్న యుద్ధంతో ఉగ్ర పోరుతో ఎంతో నష్టపోయింది.

కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి భారత్ లో కలుపుకున్నా పాకిస్తాన్ కాశ్మీర్ మీదనే ఐక్య రాజ్య సమితిలో ప్రసంగాలు చేస్తూనే ఉంటుంది. అయినా అక్కడ పాక్ నోరు మూసే వారు ఉన్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

అలాగే చైనా అనేక సరిహద్దు దేశాలను వాటి భూభాగాలను కబలిస్తూంటే పెద్దన్నగా రెచ్చిపోతూంటే ఐక్యరాజ్య సమితి పాత్ర ఏమిటి అన్న చర్చ వస్తూనే ఉంది. భారత్ లోని టిబెట్ ని ఆక్రమించి కీలకమైన సరిహద్దు భూ భాగాలను తన మ్యాప్ లో చూపిస్తూ మరికొంత కలిపేసుకుంటూ చైనా చేస్తున్న ఆగడాలకు ప్రపంచ మధ్యవర్తి ఏ రకంగా ముకుతాడు వేసింది అంటే జవాబు చూడాల్సి ఉంది.

అమెరికా పెద్దరికాన్ని పెత్తందారీ పోకడలను కూడా ఇతర దేశాలు ఒకపుడు సహించలేని పరిస్థితి ఉంటే అనేక దేశాల వ్యవహారాలలో పెద్దన్న జోక్యం చేసుకున్నా ఐక్య రాజ్యసమితి నుంచి ఏ పాటి ఉపశమనం లభించింది అన్నది కూడా కీలకమైన మౌలికమైన ప్రశ్నగానే చూస్తారు.

ఉత్త్ర కొరియా తన చిత్తం వచ్చిన తీరున వ్యవహరిస్తున్నా ప్రపంచం అణు గుప్పిట ఉన్నా అందరికీ సహనం నేర్పి కలిపి ఉంచే కీలక పాత్రలో ఉన్న ఐక్య రాజ్య సమితి ఇపుడు తన పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహిస్తోందా అన్నదే చర్చ. ఇంతకీ ఈ ఐక్య రాజ్య సమితి ఎలా ఏర్పడింది అంటే నానా జాతి సమితి ప్లేస్ లో అని చరిత్ర చెబుతోంది.

నాడు మొదటి ప్రపంచ యుద్ధాన్ని నివారించలేక నానా జాతి సమితి విఫలం అయింది. ఆ మీదట రెండవ ప్రపంచ యుద్ధం జరిగిపోయింది. అపుడు ఐక్య రాజ్య సమితి ఏర్పాటు అయింది. ఐక్య రాజ్య సమితి ఏపాటు అయ్యాక మూడవ ప్రపంచ యుద్ధం అయితే జరగలేదు కానీ అనేక దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి వాటికి మద్దతుగా పరోక్షంగా ఇతర దేశాలు అన్నీ ఉన్నాయి. అంటే ఇది ఇండైరెక్ట్ గా ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం లో ఉన్నట్లే అంటున్నారు.

లేటెస్ట్ గా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో కూడా ఐక్య రాజ్య సమితి శాంతి వచనాలు చెబుతోంది అని విమర్శలు ఉన్నాయి. ఇజ్రాయిల్‌ వరుస బాంబు దాడులతో గాజాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఐక్యరాజ్య సమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ తక్షణమే కాల్పుల విరమణ జరగాలని కోరారు. అర్ధవంతమైన చర్చలు జరగాలన్నారు.

దశాబ్దాల తరబడి ఇలాంటి చర్చలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ కూడా రెండు దేశాల ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఈ రోజు ప్రపంచం యుద్ధం అంచులలో ఉంది. యుద్ధం శరణం అంటోంది. మరి ఈ ప్రపంచంలో అందరి వద్దా అణు వస్త్రాలు ఉన్నాయి. ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితి లేదు. ఎవరికి కోపం వచ్చినా ఈ భూమి సర్వనాశనం కావడం ఖాయం. మరి ఐక్య రాజ్యసమితి క్రియాశీలంగా వ్యవహరించాలన్నది శాంతి కాముకుల మాట. అది నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.