Begin typing your search above and press return to search.

భారత్‌ పై నిన్న అమెరికా, జర్మనీ.. నేడు ఐక్యరాజ్యసమితి!

కాగా అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు విషయంలో కొద్ది రోజుల క్రితం జర్మనీ, అమెరికా చేసిన ప్రకటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి

By:  Tupaki Desk   |   29 March 2024 2:30 PM GMT
భారత్‌ పై నిన్న అమెరికా, జర్మనీ.. నేడు ఐక్యరాజ్యసమితి!
X

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఎనఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీ నుంచే పాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయబోరని ఆప్‌ ఇప్పటికే ప్రకటించింది.

కాగా అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు విషయంలో కొద్ది రోజుల క్రితం జర్మనీ, అమెరికా చేసిన ప్రకటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కేజ్రీవాల్‌ అరెస్టును నిశితంగా పరిశీలిస్తున్నామని, పారదర్శకంగా విచారణ జరగాలని ఈ రెండు దేశాలు వ్యాఖ్యానించాయి. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజే యడంపైనా అమెరికా వ్యాఖ్యలు చేసింది.

వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్‌ ఆ రెండు దేశాల దౌత్యవేత్తలను పిలిపించి సమన్లు జారీ చేసింది. భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో, సౌర్వభౌమాధికార విషయంలో ఇతరుల జోక్యం అవసరం లేదని విస్పష్టంగా తేల్చిచెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని అమెరికా, జర్మనీలకు స్పష్టం చేసింది.

అయితే జర్మనీ, అమెరికా బాటలోనే తాజాగా ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) కూడా నడిచింది. భారత్‌ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ వెల్లడించారు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. భారత పార్లమెంటు ఎన్నికల ముందు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ స్తంభింపజేయటంతో భారత్‌ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఓ విలేకరి ప్రస్తావించగా.. డుజారిక్‌ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేజ్రీవాల్‌ అరెస్టుపై ఇప్పటికే జర్మనీ, అమెరికా సైతం స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌ తన వైఖరిని ఆ దేశాలకు విష్పష్టంగా తెలియజేసింది. ఇవి పూర్తిగా తమ దేశ అంతర్గత విషయాలని.. ఆయా దేశాలు తమ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని ఆ రెండు దేశాలకు తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం ఆమోదించబోమని కుండబద్దలు కొట్టింది.

ఇది జరిగిన ఒకరోజు వ్యవధిలోనే ఐరాస స్పందించడం కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించింది. ఈ నేపథ్యంలో భారత్‌.. ఐరాసకు దీటుగా ఎలా బదులిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఐరాసకు భారీ మొత్తంలో నిధులు అందజేస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఉండటం గమనార్హం.