Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ కు షాకిచ్చిన పీవోకే ప్రజలు!

ఐక్యరాజ్య సమితి వెలుపల జరిగిన ఈ ఆందోళనల్లో యునైటెడ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 9:51 AM GMT
పాకిస్థాన్  కు షాకిచ్చిన పీవోకే  ప్రజలు!
X

గత కొన్ని రోజులుగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే) టాపిక్ బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అటూ ఐక్యరాజ్య సమితి లోనూ ఈ పేరు చెప్పి పాక్ పై భారత్ తీవ్రస్థాయిలో ఫైరవుతుంది. ఇదే సమయంలో ఎన్నో ప్రపంచ వేదికలపై ఈ విషయంపై స్పందించింది. ఈ సమయంలో తాజాగా ఐరాస వద్ద నిరసన చేపట్టారు పీవోకే ప్రజలు.

అవును... పీవోకేలోని ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వంపై ఏ మాత్రం సంతృప్తిగా లేరనేది తెలిసిన విషయమే. గతంలోనే తమను భారత్‌ లో కలపాలని అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని ప్రజలకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో పాక్ సర్కార్ ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈ సమయంలో పాకిస్థాన్‌ పాలకులకు వ్యతిరేకంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు ఐక్యరాజ్య సమితివద్ద తమ నిరసన గళం వినిపించారు. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 54వ సమావేశాలు జరుగుతున్న సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన కొందరు రాజకీయ కార్యకర్తలు.. ఇస్లామాబాద్‌ పాలకులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

ఇందులో భాగంగా... పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ వెంటనే పీవోకేను ఖాళీ చేయాలని కోరారు. ఫలితంగా తాము శాంతియుత జీవితం గడిపేందుకు సహకరించాలని నినాదాలు చేశారు. ఐక్యరాజ్య సమితి వెలుపల జరిగిన ఈ ఆందోళనల్లో యునైటెడ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పీవోకే లో ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఇలా నిరసన కార్యక్రమాలకు దిగుతుంటే... వారు చేస్తోన్న ఆందోళనలను పాకిస్థాన్ పాలకులు ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. ఇందులో భాగంగా పద్దతీ పాడూ లేకుండా విద్యుత్ కోతలకు పాల్పడుతున్నారు. దీంతో పీవోకేలో అన్ని వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. మరోవైపు పాకిస్థాన్‌ లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీవోకేలో విద్యుత్‌ బిల్లులను భారీగా వసూలు చేస్తున్నారు.

మరోపక్క పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో మూడువందల ఏభైరూపాయలు చేరువవుతుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా 10లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేయాలని పాక్ సైన్యం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.