Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ప్రత్యేకం.. సౌదీ అరేబియా స్మార్ట్‌ సిటీ!

గ్రీన్‌ హౌస్‌ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధి గల నగరంగా దీన్ని తీర్చిదిద్దుతారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 10:00 AM GMT
ప్రపంచంలోనే ప్రత్యేకం.. సౌదీ అరేబియా స్మార్ట్‌ సిటీ!
X

బుర్జ్‌ ఖలీపాలాంటి కట్టడంతో దుబాయ్‌ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన కట్టడంగా బుర్జ్‌ ఖలీపా రికార్డులకెక్కింది. దాన్ని చూడటానికి వెళ్లే పర్యాటకులతో యూఏఈకి భారీ ఎత్తున ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు ఇదే కోవలో సౌదీ అరేబియా కూడా చేరుతోంది.

ప్రస్తుతం సౌదీ అరేబియా ‘నియోమ్‌’ పేరుతో ఒక భారీ స్మార్ట్‌ సిటీని నిర్మిస్తోంది. ఈ స్మార్ట్‌ సిటీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో రోడ్లు ఉండవు.. కార్లు కనిపించవు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది.

కాగా నియోమ్‌ ను వాయవ్య సౌదీ అరేబియాలోని టబుక్‌ ప్రావిన్స్‌ లో నిర్మిస్తున్నారు. ఇది ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్‌ సమీపంలో, జోర్డాన్‌ దేశానికి దక్షిణంగా ఉంది. 500 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల వ్యయంతో ఈ స్మార్ట్‌ సిటీని నిర్మిస్తున్నారు. ఈ భవిష్యత్‌ నగరం సంపూర్ణంగా ‘స్వచ్ఛమైన శక్తి (నేచురల్‌ రిసోర్సెస్‌)’తో మనుగడ సాగించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

వ్యవసాయం విషయంలో కూడా నియోమ్‌ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. గ్రీన్‌ హౌస్‌ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధి గల నగరంగా దీన్ని తీర్చిదిద్దుతారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే నియోమ్‌ పేరుకు స్మార్ట్‌ సిటీనే అయినప్పటికీ ఈ అధునాతన సిటీలో కార్లూ, రోడ్లు ఉండవని చెబుతున్నారు. జీరో కర్బన ఉద్గారాలతో స్మార్ట్‌ సిటీ పూర్తి కాలుష్య రహితంగా ఉండనుంది. కాగా ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఇప్పటికే 20 శాతం పనులు పూర్తయ్యాయి. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్ల పరిష్కరానికి ఈ స్మార్ట్‌ సిటీ ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెబుతున్నారు.

కాగా నియోమ్‌ అని స్మార్ట్‌ సిటీకి పేరు పెట్టడం వెనుక ఆసక్తికర కథనం వినిపిస్తోంది. నియోమ్‌ అనేది గ్రీకు పదమని.. నియో అంటే కొత్తది అని అర్థమని పేర్కొంటున్నారు. ఇక ‘మ్‌’ అనేదానిని అరబిక్‌ పదం ముస్తాక్బాల్‌ నుంచి తీసుకున్నారని తెలుస్తోంది. దీని అర్థం ‘భవిష్యత్తు’ అని సమాచారం.

మరోవైపు నియోమ్‌ అనే పదాన్ని సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పేరు నుంచి కూడా తీసుకున్నారని అంటున్నారు. ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగాసిటీ ప్రాజెక్ట్‌ ను చేపట్టనున్నట్లు 2017 అక్టోబరులో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ సిటీ సౌదీ అరేబియా– 2030 విజన్‌ లలో ఒకటి కావడం గమనార్హం. దీని ద్వారా సౌదీ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.