విమాన ప్రయాణం కంటే ముందే.. హైస్పీడ్ రైలుతో.. అదెలానంటే?
కేంద్రం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ లో హైస్పీడ్ రైళ్ల కారిడార్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముంబయి - ఆహ్మాదాబాద్ మధ్య హైస్పీడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Feb 2026 11:00 AM ISTకేంద్రం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ లో హైస్పీడ్ రైళ్ల కారిడార్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముంబయి - ఆహ్మాదాబాద్ మధ్య హైస్పీడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఏడు హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో ప్రకటించింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ హైస్పీడ్ రైల్ నెట్ వర్కులో హైదరాబాద్ అత్యంత కీలకంగా మారనుంది. ఏడు కారిడార్ లో మూడు హైదరాబాద్ కేంద్రంగా ఉండటమే ఇందుకు కారణం.
హైదరాబాద్ నుంచి ఫూణె, చెన్నై, బెంగళూరు నగరాలకు ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే రవాణా రంగ ముఖచిత్రం ఇట్టే మారిపోతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యనగరాలకు మధ్య ప్రయాణ వేగం భారీగా తగ్గిపోవటమే కాదు.. ప్రస్తుతం 12 -14 గంటలు పట్టే చెన్నై, ఫూణె, బెంగళూరు మహానగరాలకు ప్రయాణం థియేటర్ లో సినిమా చూసి ఇంటికి వచ్చే సమయానికి దగ్గరగా ఉండనుంది. ఇదే.. ఈ ప్రాజెక్టు హైలెట్ అంశంగా చెప్పాలి.
మరింత వివరంగా చెబితే.. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ తో విమాన ప్రయాణం కంటే తక్కువ సమయంలోనే హైస్పీడ్ రైలు ప్రయాణం పూర్తవుతుందని చెప్పాలి. ఇప్పటివరకు రైల్వేలో గరిష్ఠ వేగంతో నడిచే రైళ్లు గంటకు 150కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. త్వరలో పట్టాల ఎక్కనున్న వందేభారత్ స్లీపర్ 180కి.మీ. వేగంతో పరుగులు తీయనుంది. హైస్పీడ్ కారిడార్ రైలు ప్రాజెక్టును గంటకు 350కిమీ వేగాన్ని తట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు.
అయితే.. మలుపులు.. స్టాపేజీలు లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే గంటకు 200-250కి.మీ. వేగంతో ప్రయాణించటం పక్కగా చెబుతున్నారు. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ఖమ్మం, కర్నూలు లాంటి నగరాలకు గంటలో చేరుకోవచ్చు. అదే ఏపీ రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి కేవలం 75 నిమిషాల్లో ప్రయాణం పూర్తి కానుంది. అనంతపురానికి 90 నిమిసాల్లో.. బెంగళూరు, చెన్నై, ఫూణె నగరాలకు మూడు నుంచి మూడున్నర గంటల్లో చేరుకునే వీలుంది. అయితే.. భూసేకరణ, నిర్మాణం లాంటి అంశాలతో ఆలస్యం కాకుంటే త్వరలోనే పూర్తవుతుంది. అయితే.. ఈ ప్రాజెక్టుకు ఖర్చు భారీగా ఉండనుంది. అదేసమయంలో ఇందులో టికెట్ మిగిలిన రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
