రక్షణకు చైనా కంటే ఎక్కువ ఖర్చు... బడ్జెట్ లో కీలక కేటాయింపులు!
గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం రక్షణ రంగానికి ఈ వార్షిక బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉందనే చర్చల నడుమ.. వాటిని నిజం చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు
By: Raja Ch | 1 Feb 2026 4:50 PM ISTగత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం రక్షణ రంగానికి ఈ వార్షిక బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉందనే చర్చల నడుమ.. వాటిని నిజం చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగా.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ రంగ కేటాయింపులు రూ.7,84,678.28 కోట్లు కావడం గమనార్హం. దీనిపై హర్షం వ్యక్తం అవుతోంది!
అవును... బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయింపులు ఇటీవల తగ్గుతున్న జీడీపీ ధోరణిని తిప్పికొట్టాయి. ఈ క్రమంలో 2026-26 ఆర్థిక సంవత్సరానికి రూ.6,81,210.27 కోట్లు కేటాయించగా.. అది జీడీపీలో 1.91%గా ఉంది. అయితే తాజా కేటాయింపుల్లో అది రూ.7.84 లక్షల కోట్లుగా ప్రకటించడంతో.. రక్షణ రంగ కేటాయింపుల్లో దాదాపు 15% కంటే ఎక్కువ కేటాయింపులు జరిగినట్లయ్యింది. జీడీపీలో ఇది దాదాపు 2% కాగా.. ఇది రక్షణ కేటాయింపుల్లో చైనా కంటే ఎక్కువని చెబుతున్నారు!
వాస్తవానికి 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఈ కేటాయింపులు రూ.4.48 లక్షల కోట్లు (జీడీపీలో 2.25%!) గా ఉండగా.. 2022-23 కి రూ.5.25 లక్షల కోట్లకు.. 2023-24లో 5.94 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే క్రమంలో... 2024-25లో రూ.6.2 లక్షల కోట్లు (జీడీపీలో 1.91%).. 2025-26లో రూ.6.81 లక్షల కోట్లు (జీడీపీలో 1.91%) కేటాయింపులు జరగ్గా.. తాజాగా సుమారు 15% పెరుగుదలతో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రూ.7.84 లక్షల కోట్లు (జీడీపీలో 1.997%) కేటాయింపులు ప్రకటించారు.
ప్రధానంగా గత ఏడాది పాకిస్థాన్ తో జరిగిన ఘర్షణ తర్వాత రక్షణ రంగ బడ్జెట్ పై చర్చ బలంగా నడిచింది. ఇలా పాక్ తో పాటు చైనా నుంచి బెదిరింపుల మధ్య సైనిక సంసిద్ధత, ఆధునీకరణపై మోడీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ లో భారీ కేటాయింపులని చెబుతున్నారు. కాగా... ఇటీవల ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కొనుగోలు చేయడానికి రూ.3.25 లక్షల కోట్ల ఒప్పందాన్ని భారత్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్... ఈ బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... ఆపరేషన్ సిందూర్ చారిత్రాత్మక విజయం తర్వాత.. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే తమ సంకల్పాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేసిందని అన్నారు. ఇదే సమయంలో... భద్రత, అభివృద్ధి, స్వావలంబన మధ్య సమతుల్యతను ఈ బడ్జెట్ బలపరుస్తుందని తెలిపారు.
కాగా... స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) డేటా ప్రకారం... అమెరికా తన జీడీపీలో సుమారు 3.4 శాతం రక్షణ కోసం ఖర్చు చేస్తుండగా... చైనా మాత్రం 1.7 శాతం ఖర్చు చేసుందని అంచనా. ఈ క్రమంలో తాజా బడ్జెట్ లో భారత్ తన జీడీపీలో సుమారు 2 శాతం (1.997%) కేటాయించడం గమనార్హం!
