భారీ సైజులో బడ్జెట్...అప్పులు తప్పదా ?
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 53.5 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ని రూపొందించింది.
By: Satya P | 2 Feb 2026 12:05 AM ISTకేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 53.5 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ని రూపొందించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం రాబడులు కేంద్ర ఖజానాకు చేరేది చూస్తే మొత్తం రాబడులు 36.5 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇందులో కేంద్ర నికర పన్ను రాబడులు 28.7 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు.
లోటు ఎంతంటే :
ఇక అంచనా మొత్తానికి రాబడులకు మధ్య 17 లక్షల కోట్ల అంతరం కనిపిస్తోంది. దాంతో ఈ తేడాను ఎలా భర్తీ చేస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. అప్పులు తీసుకుంటారా లేక ఇతర మార్గాలు ఉన్నాయా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 17 లక్షల కోట్లు అంటే దేశంలో నలభై శాతం పైగా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ తో సమానంగా ఉంటోంది.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే :
ఇక బడ్జెట్ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, స్థూల మార్కెట్ రుణాలు 17.2 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటాయని తెలిపారు. అయితే మొత్తం ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిర్మాణాత్మక సంస్కరణలకు పెద్ద ప్రోత్సాహం అందించడానికి ఈ బడ్జెట్ ని రూపొందించామని చెప్ప్పారు. ఈసారి మొత్తం మూలధన వ్యయ కేటాయింపు 12.2 లక్షల కోట్ల రూపాయలుగా గా ఉందని, అది జీడీపీలో 4.4 శాతమని గుర్తు చేశారు. ఇక గత 10 సంవత్సరాలలో ఇదే అత్యధికమని కూడా ఆమె అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 4.4 శాతం కంటే తక్కువగా, 2026-27లో ద్రవ్యలోటు జీడీపీలో 4.3 శాతంగా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా సీతారామన్ తెలిపారు.
వృద్ధి రేటు వేగం :
ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి ఆర్థిక వ్యవస్థకు మార్గాన్ని సుగమం చేస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తోందని అన్నారు. ఉత్పాదకత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి అవసరమైన ఒక వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో, ప్రధానంగా ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలతో పర్యావరణ వ్యవస్థ ను నిర్మించడంపై కేంద్రం దృష్టి సారిస్తోందని ఆమె అన్నారు. అలాగే 21వ శతాబ్దం పూర్తిగా సాంకేతికతతో నడుస్తోందని, సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేలా సాంకేతికతను తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రతి నగరానికి సంవత్సరానికి వేయి కోట్ల రూపాయలు ఇస్తున్నామని ప్రధానంగా టైర్ 2 మరియు టైర్ 3 నగరాలపై దృష్టి పెట్టనున్నట్లుగా ఆర్ధిక మంత్రి
వీటి పైనే ఫోకస్ :
ఇక దేశంలో ఎలక్ట్రానిక్ రంగం గురించి కూడా కేంద్రం ఫోకస్ పెడుతోందని అన్నారు. నలభై వేల కోట్ల రూపాయలతో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకం భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి అతి పెద్ద ప్రోత్సాహమని ఆమె చెప్పారు. అలాగే అరుదైన ఖనిజాల కారిడార్ గురించి బడ్జెట్ లో ప్రస్తావించామని గుర్తు చేశారు. భారతదేశం తన సొంత వనరులతో తన అవసరాలను తీర్చగలిగేలా అరుదైన ఖనిజాల కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను గుర్తించి వెలికితీయగలిగితే, ఇతర దేశాల వనరులపై భారత్ ఆధారపడటం పూర్తి స్థాయిలో తగ్గుతుందని ఆర్థిక మంత్రి అన్నారు. అరుదైన ఖనిజాల కారిడార్లు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద మార్పును తీసుకువస్తాయని ఆశాభావం ఆమె వ్యక్తం చేస్తున్నారు.
