Begin typing your search above and press return to search.

పిల్లలు మా వల్ల కాదు ఇదే సమస్య!

అప్పట్లో సంతానమే సంపదగా భావించేవారు! ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆస్తిగా భావించేవారు. అయితే ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి.

By:  Tupaki Desk   |   11 Jun 2025 4:30 PM
పిల్లలు మా వల్ల కాదు ఇదే సమస్య!
X

అప్పట్లో సంతానమే సంపదగా భావించేవారు! ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆస్తిగా భావించేవారు. అయితే ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి. ఒక్క బిడ్డ కంటే ఎక్కువమందిని కనలేని పరిస్థితులు వచ్చేశాయి. ఇప్పుడు పిల్లలను చదివించడమే గగనం అయిపోవడంతో పాటు ఇతర యాక్టివిటీస్ కి సంబంధించిన ఖర్చులు పెరిగిపోయాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది.

అవును... పునరుత్పత్తి హక్కులపై పనిచేసే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యు.ఎన్‌.ఎఫ్‌.పీ.ఏ) విడుదల చేసిన తాజా నివేదిక.. పునరుత్పాదకత క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లక్షలాదిమంది ప్రజలు తమకు కావాల్సినంతమంది సంతానాన్ని పొందలేకపోతున్నారని చెప్పింది. ఇదే సమయంలో... తల్లిదండ్రులు కావడమనేది ఈ రోజుల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడం, కొంతమందికి తగిన భాగస్వామి కొరవడటం వంటి కారణాలనూ ఈ సంస్థ పేర్కొంది.

యూ.ఎన్.ఎఫ్.పీ.ఏ సర్వే సంతానోత్పత్తి ఆలోచనలపై 14 దేశాలలోని 14 వేల మందిని చేసింది. ఈ సర్వేలో ప్రతీ ఐదుగురిలో ఒకరు తాము కోరుకున్నంతమంది సంతానాన్ని పొందలేకపోయామని చెప్పారు. ఇందులో భారత్ తో పాటు అమెరికా, దక్షిణ కొరియా, హంగేరీ, జర్మనీ, థాయ్‌ లాండ్, ఇటలీ, మెక్సికో, స్వీడన్, బ్రెజిల్, ఇండోనేసియా, మొరాకో, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలలో ఈ సర్వే చేశారు.

ఈ సర్వేలో యువకులతో పాటు ఇప్పటికే పునరుత్పాదక వయస్సు దాటిన వారిని కూడా భాగస్వాములను చేసింది. ఈ సందర్భంగా స్పందించిన యూ.ఎన్.ఎఫ్.పీ.ఏ చీఫ్ డాక్టర్ నటాలియా కానెమ్... ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడనట్టుగా సంతానోత్పత్తి తగ్గే దశలోకి ప్రవేశించిందని తెలిపారు. ఈ సర్వేలో పాల్గొన్న చాలామంది కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలను కోరుతున్నారని వెల్లడించారు.

అయితే... వారికి కావలసిన కుటుంబాన్ని ఏర్పరచుకునే అవకాశమే లేకపోవడం వల్లే సంతానోత్పత్తి గణనీయంగా పడిపోతోందని అన్నారు. మొత్తమీద అన్నిదేశాలలో 39శాతం మంది ప్రజలు తాము పిల్లలను కనకుండా ఆర్థికపరమైన పరిమితులు అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఇందులో అత్యధికంగా కొరియాలో (58%), తక్కువగా స్పీడన్ (19%) దేశస్థులు ఉన్నారు.