వేల పోస్టులకు 25లక్షల అప్లికేషన్లు.. ప్యూన్ పోస్ట్ కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్స్!
ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలోని పార్టీలు లక్షల్లో, కేంద్రంలోని పార్టీలు కోట్లలో ఉద్యోగ కల్పనపై అభూతకల్పన హామీలు ఇస్తారనే సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 23 April 2025 2:21 PM ISTఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలోని పార్టీలు లక్షల్లో, కేంద్రంలోని పార్టీలు కోట్లలో ఉద్యోగ కల్పనపై అభూతకల్పన హామీలు ఇస్తారనే సంగతి తెలిసిందే! ఆ విషయంలో.. ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పే మాటలకు ఏమాత్రం పొంతన ఉండదు.. ఫలితంగా రోజు రోజుకీ దేశంలో నిరుద్యోగం పీక్స్ కి చేరుతోందని అంటున్నారు!
ఏ ప్రభుత్వం అయినా ఎన్నికల ప్రచార సమయంలో చెప్పే హామీల్లో సగం హామీని నెరవేర్చినా.. దేశంలో నిరుద్యోగుల సంఖ్య చాలా వరకూ తగ్గిపోతుందని అంటారు. అయితే.. ఆ హామీ ప్రతీసారి రాజకీయ పార్టీలకు ఆయుష్షును పెంచుతూ.. నిరుద్యోగుల ఉసురు తీస్తోంది! ఈ సమయంలో తాజాగా వేల ప్యూన్ పోస్టుల కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చిన విషయం తెరపైకి వచ్చింది.
అవును... దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పే ఓ షాకింగ్ ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. తాజాగా రాజస్థాన్ లో 53 వేల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే... ఈ 53 వేల పోస్టులకు చాలా మంది ఊహించని స్థాయిలో అన్నట్లుగా సుమారు పాతిక లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.
పైగా... ఇలా దరఖాస్తు చేసుకున్నవారిలో అత్యధికంగా ఉన్నత విద్యావంతులు ఉండటం గమనార్హం! ఇందులో భాగంగా... ఈ ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసిన వారిలో పీ.హెచ్.డీ. చేసినవారు.. ఎంబీయే, ఎంసీఏ చేసినవారు.. గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారితో పాటూ ఇతరాత్ర డిగ్రీలు ఉన్నవారు ఉన్నారని అంటున్నారు.
కాగా... ప్రతీ ఏటా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్న మాట వాస్తవమే! అయినప్పటికీ.. ఏటా కళాశాలల నుంచి విద్యార్థులుగా సమాజంలోకి ఎంటరవుతున్న తాజా నిరుద్యోగులతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువని అంటున్నారు. దానికి తోడు ప్రైవేటు రంగంలో ఎంత పెద్ద ఉద్యోగానికైనా భద్రత తక్కువగా ఉంటుంది!
దీంతో... చిన్నదో పెద్దదో జీవితానికి భరోసాగా ఉంటూ, ఉద్యోగ భద్రత పుష్కలంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగం ఎంత చిన్నదైనా అదే బెటర్ అనే క్లారిటీకి చాలా మంది వస్తున్నారని అంటున్నారు.
