అమెరికా వల్ల 40 లక్షల హెచ్‌ఐవీ మరణాల ముప్పు
ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో గత ఆరు నెలలుగా అమెరికా నిధులు నిలిచిపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఐరాస నివేదిక పేర్కొంది.
By: Tupaki Desk | 11 July 2025 8:15 AM ISTప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణకు కీలక మద్దతు అందిస్తున్న అమెరికా నిధుల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా తన ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరించకపోతే 2029 నాటికి ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు, అదనంగా 60 లక్షల కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఐరాస ఎయిడ్స్ విభాగం నివేదిక హెచ్చరించింది.
గత మూడు దశాబ్దాలుగా హెచ్‌ఐవీ నియంత్రణలో అమెరికా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా యూఎస్‌ఎయిడ్ (USAID) ద్వారా పేద దేశాల్లో ఆరోగ్య కేంద్రాలు, క్లినిక్స్, ఔషధ సరఫరా, అవగాహన కార్యక్రమాలకు భారీగా నిధులను వెచ్చిస్తూ వస్తోంది. ప్రతి ఏడాది 160కి పైగా దేశాల్లో దాదాపు ₹3.8 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తుంది. 2025లో హెచ్‌ఐవీ నియంత్రణ కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయాలని సూచించినప్పటికీ, తాజా పరిణామాలతో ఈ ఫండ్ పూర్తిగా నిలిచిపోయింది.
భారీ ప్రభావం చూపిన ఆరు నెలలు
ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో గత ఆరు నెలలుగా అమెరికా నిధులు నిలిచిపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఐరాస నివేదిక పేర్కొంది. ఈ నిధుల కొరత ఇప్పటికే అనేక ప్రతికూల ప్రభావాలకు దారితీసింది. ఔషధాల సరఫరా గొలుసు అస్థిరంగా మారింది. అవసరమైన మందులు సకాలంలో అందుబాటులో ఉండటం లేదు. రోగులకు చికిత్స అందించే కేంద్రాలు మూసివేయబడ్డాయి. వేలాది క్లినిక్స్‌లో సిబ్బంది లేక ఖాళీగా మారిపోయాయి. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. నివారణ, చికిత్స, సంరక్షణ కార్యక్రమాలు స్తంభించిపోయాయి.
భౌగోళిక-రాజకీయ, వాతావరణ ప్రభావం కూడా
హెచ్‌ఐవీ నియంత్రణ చర్యలకు యుద్ధాలు, వాతావరణ మార్పులు, రాజకీయ అస్థిరతలు కూడా అడ్డంకులుగా మారుతున్నాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ముప్పును నివారించాలంటే తిరిగి అంతర్జాతీయ సహకారాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పింది.
అంతర్జాతీయ సంస్థలపై దెబ్బ
అమెరికా నిధుల నిలిపివేత అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలు ఇప్పటికే బలహీనమవుతున్న తరుణంలో, ఈ నిర్ణయం మరింత ముప్పును మోస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ ఆరోగ్య భద్రతకు అమెరికా సహకారం అత్యంత కీలకమని నిపుణులు భావిస్తున్నారు.
ఉపసంహరణ అవసరం
ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమీక్షించి, మళ్లీ నిధుల విడుదల జరగకపోతే భవిష్యత్తులో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయానికి జోక్యం చేసుకోకపోతే, ప్రపంచం పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సి రావచ్చు అని ఐరాస తన నివేదికలో స్పష్టం చేసింది. హెచ్‌ఐవీని నియంత్రించడంలో ప్రపంచ దేశాలు సాధించిన ప్రగతిని కాపాడటానికి, భవిష్యత్ విపత్తులను నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం పిలుపునిస్తోంది.
