పేదరికం కోరల్లోకి ప్రపంచం....యుద్ధం తెచ్చిన ఫలితం
యుద్ధం ఎపుడూ అశాంతిని అరాచకాన్ని అపసవ్య సమాజాన్ని అందిస్తుంది. యుద్ధం తరువాత వెనక్కి చూస్తే మృతులు ఎంత మందో జీవన్మృతులు అంతకు మించి ఉంటారు.
By: Satya P | 15 April 2026 12:05 AM ISTయుద్ధం ఎపుడూ అశాంతిని అరాచకాన్ని అపసవ్య సమాజాన్ని అందిస్తుంది. యుద్ధం తరువాత వెనక్కి చూస్తే మృతులు ఎంత మందో జీవన్మృతులు అంతకు మించి ఉంటారు. మృతులే అదృష్టవంతులు అనిపించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే పశ్చిమాసియాలో చోటు చేసిన సంక్షోభం ప్రపంచానికి అందిస్తున్న అతి పెద్ద చేదు ఫలితం. అదే పేదరికం. ఈ రోజున ప్రపంచంలోకి అనేక దేశాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. అయిదారేళ్ళ క్రితం మొత్తం భూగోళాన్ని ఉయ్యాల పట్టి ఊపేసిన కరోనా వంటి విపత్తు ధాటికి గురి అయి ఇంకా తేరుకోని దేశాలు ఉన్నాయి. ఇక భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మీదనే యుద్ధ ప్రభావం పడుతూంటే పేద దేశాల సంగతి చెప్పనవసరం లేదు.
లక్షల్లో పేదలు :
ఈ యుద్ధం లక్షల్లో పేదలను కొత్తగా తయారు చేసింది అని ఐక్య రాజ్య సమితి తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతే కాదు ఎటు చూసినా చేటు కాలం కరవు కాలం దాపురిస్తోందని కూడా హెచ్చరించింది ఆహార కొరతతో అల్లాడిపోతూ అంతర్జాతీయ సమాజం నలిగి పోతుందని కూడా ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇప్పటికి దాదాపుగా నెలన్నరకు పైగా సాగుతున్న పశ్చిమాసియా యుద్ధం మీద అందించిన ఈ నివేదికలో ఎన్నో కఠిన సత్యాలు ఉన్నాయని అంటున్నారు.
మండుతున్న ధరలతో :
ఇప్పటికీ కొనసాగుతున్న యుద్ధం ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు అనేక దేశాలలో పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని నివేదిక పేర్కొంది. సామాన్య దేశాలే కాదు భారత్ మీద కూడా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అధికంగా పడబోతోంది అని అంటున్నారు. ఈ యుద్ధం కారణంగా భారత్ లోనే పాతిక లక్షల మంది కొత్త పేదలు తయారు అయ్యారని నివేదిక చెబుతోంది. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తలు ఆసియా ఫసిఫిక్ లో మానవ అభివృద్ధి పైన ప్రభావాలు అన్న పేరుతో యూ ఎస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఒక నివేదికను తాజాగా రూపొందించింది.
ఆహార భద్రతకు ముప్పు :
ఈ నివేదిక ప్రకారం చూస్తే కనుక ఈ యుద్ధం మూలంగా ఆసియా ఫసిఫిక్ అంతటా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు. అభివృద్ధికి బ్రేకులు పడడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మద్ని ప్రజలు పేదరికంలో కూరుకుని పోయే ప్ర్మాదం ఉందని అంచనా వేసింది. ఇక చైనాలోనూ ఈ యుద్ధం ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చు అని నివేదిక పేర్కొంది. పెరిగిన ఇంధనం ధరలతో రవాణా, ముడి సరుకుల ధరలు పెరగడం, అలాగే కుటుంబాల కొనుగోలు శక్తిని పూర్తిగా తగ్గించేలా పర్యవసానాలు ఉన్నాయని వెల్లడించింది. ఆహార భద్రత మీద తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వాల బడ్జెట్లు సైతం ప్రభావం అవుతాయని అంటోంది.
ఈ దేశాలన్నీ ఇబ్బందుల్లో :
భారత్ పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పిలిప్పీన్స్ తో సహా అనేక దేశాలలోని ఆహార భద్రత ఒత్తిళ్ళు తీవ్రమవుతాయని ఈ నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఇలా ఉంటే ఈ యుద్ధం ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే భారత్ వంటి దేశాలలో యూరియా నిల్వలు తగ్గిపోతాయని అది రైతుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది. అంతే కాదు హార్మూజ్ జలసంధి పరిసరాలలో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా భారత్ లో వైద్య పరికరాలకు సంబంధించిన ముడి పదార్ధాలకు కూడా ఇబ్బంది అవుతుందని స్పష్టం చేస్తోంది. దాంతో ఈ ధరలు ఏకంగా యాభై శాతం పైగా పెరగవచ్చునని చెప్పుకొచ్చింది. ఔషధాల టోకు ధరలు ఇప్పటికే పది నుంచి పదిహేను శాతం పెరిగాయని వెల్లడించింది. మొత్తం మీద యుద్ధం ప్రభావం అధికంగా ఉంటుందని ప్రపంచం అంతా పేదరికం కోరల్లోకి వెళ్ళడం ఖాయమని చెబుతున్న ఈ నివేదిక చూస్తే కలవరం కలుగుతోది.
