Begin typing your search above and press return to search.

సంచలన పోస్టుతో రాజీనామా చేసిన యూఎస్ అధికారి చెప్పిన షాకింగ్ నిజం

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం తుదిదశకు చేరుకుందా? చూస్తుండగానే యుద్ధం మొదలై నెల దాటేసింది.

By:  Garuda Media   |   31 March 2026 12:18 PM IST
సంచలన పోస్టుతో రాజీనామా చేసిన యూఎస్ అధికారి చెప్పిన షాకింగ్ నిజం
X

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం తుదిదశకు చేరుకుందా? చూస్తుండగానే యుద్ధం మొదలై నెల దాటేసింది. మూడు వారాల్లోపు ఇరాన్ ను అదుపులోకి తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినప్పటికీ.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఇలాంటివేళ.. ఇరాన్ ను అదుపులోకి తీసుకొచ్చేందుకు.. దానిపై తిరుగులేని అధిక్యతను ప్రదర్శించేందుకు వీలుగా.. కొన్ని దేశాలు అణుదాడికి ప్లాన్ చేస్తున్నాయా? అన్న సందేహానికి తెర తీసేలా ఒక షాకింగ్ వాదనకు తెర లేచింది. దీనికి ఐక్యరాజ్యసమితిలోని ఒక దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహానికి తెర తీసేలా మారాయి.

ఐక్యరాజ్య సమితికి చెందిన సీనియర్ దౌత్యవేత్త మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ పై అణు ఆయుధాల్ని ప్రయోగించేందుకు వీలుగా ఐక్యరాజ్య సమితి ప్రణాళికలు సిద్ధం చేస్తుందని పేర్కొనటం ద్వారా ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు నేపథ్యాన్ని చూస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకోవటం.. . హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఇరాన్ సైతం దానికి ధీటుగా ప్రతిస్పందిస్తున్న వేళ.. పరిస్థితులు ఎప్పుడేం జరుగుతాయో అర్థం కాని పరిస్థితి.

ఇలాంటి వేళలోనే మొహమ్మద్ సఫా ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. టెహ్రాన్ పై అణుదాడి చేసే ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజం చేస్తుందన్న ఆయన.. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. అందులో ఒక ఫోటోను షేర్ చేశారు. ఇంతకు ఆయన తన పోస్టులో ఏమన్నారంటే.. ‘‘ఇక్కడ మీరు చూస్తున్నది టెహ్రాన్ నగర చిత్రం. యుద్ధం కావాలని కోరుకునే వారు.. ఎప్పుడూ యుద్ధ భూమిని చూడని వారు దీనిని ఏదో జనాభా లేని ఎడారి అని అనుకుంటున్నారు. కానీ.. ఇది దాదాపు ఒక కోటి జనాభా కలిగిన నగరం. ఇలాంటి నగరంపై బాంబులు వేయాలని అనుకోవటం విక్రతమైన ఆలోచన. వాషింగ్టన్.. లండన్ లాంటి నగరాలపై అణుదాడి జరిగితే ఎంతటి వినాశనం ఉంటుందో.. ఇక్కడ కూడా అదే జరుగుతుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మానవత్వానికి వ్యతిరేకంగా జరగబోయే ఈ నేరానికి తాను సాక్షిగా ఉండలేకనే.. తన దౌత్య జీవితాన్ని త్యాగం చేసి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లుగా సఫా పేర్కొన్నారు. టెహ్రాన్ కేవలం ఎడారి కాదని.. అక్కడ కోటి మంది సామాన్య ప్రజలు.. పిల్లలు నివసిస్తున్నట్లుగా చెప్పారు. ఐక్యరాజ్య సమితిలోని కొందరు ఉన్నతాధికారులు ఒక పవర్ ఫుల్ లాబీకి తొత్తులుగా మారినట్లుగా ఆయన మండిపడ్డారు. ఈ సీనియర్ దౌత్యవేత్త పోస్టు చేసిన టెహ్రాన్ నగర ఫోటోను చూసినప్పుడు..ఇరాన్ రాజధాని ఇంత డెవలప్ అయిన నగరమా? అన్న భావన కలుగకమానదు. తన పోస్టులో మరో అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా అణుయుద్ధ ముప్పు పొంచి ఉందని.. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపటం ద్వారా మాత్రమే ఈ వినాశనాన్ని ఆపగలరని పేర్కొనటం గమనార్హం. ఈ పోస్టు చూసినంతనే వెన్నులో చలి రేగటం ఖాయం.