Begin typing your search above and press return to search.

"గ్రేట్‌ ట్రైన్‌ రాబరీ"... "ధూమ్" సినిమాను ఇన్స్పైర్ చేసిన రియల్ స్టోరీ!!

"ధూమ్" సినిమ సిరీస్ లు గుర్తుండే ఉంటాయి. ఈ సిరీస్ లో ముఖ్యంగా "ధూమ్ - 2"లో హృతిక్ రోషన్ చేసే దొంగతనాలే సినిమాలో హైలైట్స్.

By:  Tupaki Desk   |   4 Nov 2023 4:30 PM GMT
గ్రేట్‌  ట్రైన్‌  రాబరీ... ధూమ్ సినిమాను ఇన్స్పైర్  చేసిన రియల్  స్టోరీ!!
X

"ధూమ్" సినిమ సిరీస్ లు గుర్తుండే ఉంటాయి. ఈ సిరీస్ లో ముఖ్యంగా "ధూమ్ - 2"లో హృతిక్ రోషన్ చేసే దొంగతనాలే సినిమాలో హైలైట్స్. ఈ క్రమంలో నమీబ్ ఎడారిలో క్వీన్ ఎలిజబెత్ - 2ని తీసుకువెళుతున్న రైలులో "మిస్టర్ ఏ" చేసే దోపిడీ మరింత ఆసక్తికరంగా ఉంటుంది! అయితే యూకేలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. అయితే ఇక్కడ 15మంది హృతిక్ లు ఉండటం గమనార్హం! వీరు కూడా ట్రైన్ ని హైజాగ్ చేసి ఏకంగా 500 కోట్లు కొట్టేశారు.

15 మంది దొంగల ముఠా ఒక రైలును హైజాక్ చేసి.. 30 నిమిషాల్లో రూ.500 కోట్లు దోచుకెళ్లింది. అయితే... ఆ ముఠాలోని చివరి వ్యక్తి బాబీ వెల్చ్‌ ఇటీవల మృతి చెందాడు. దీంతో "గ్రేట్‌ ట్రైన్‌ రాబరీ" స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది. బ్రిటన్‌ లో సంచలనం సృష్టించిన వ్యవహారాన్ని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తాజాగా ప్రచురించాయి. దీంతో ఈ భారీ దోపిడీల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటన ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

అవును... 1963 ఆగస్టు 8న తెల్లవారుజామున మూడుగంటలకు లండన్ లో ఈ గ్రేట్ ట్రైన్‌ రాబరీ జరిగింది. అంటే... సరిగ్గా 60 ఏళ్ల క్రితం అన్నమాట! ఉత్తర లండన్‌ లోని బ్రిడెగో బ్రిడ్జ్‌ సమీపంలో గ్లాస్గో-లండన్‌ రాయల్‌ మెయిల్‌ హైజాక్‌ అయ్యింది. ఈ విషయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. దానికి అసలు కారణం... ఆ ట్రైన్ పెద్ద మొత్తంలో నగదుతో వెళ్తుండటమే. దీంతో అందులో ఉన్న డబ్బు కోసమే ఈ హైజాక్ అని అధికారులు ఒక క్లారిటీకి వచ్చేశారంట!

ఆ ట్రైన్ లో ఆ రోజు భారీ నగదు షిప్టింగ్ ఉందని ముందస్తు సమాచారం ఉన్న 15 మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు. అనంతరం ఈ భారీ దోపిడీకి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా వారు ముందుగా రైలు సిగ్నల్ వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. దీంతో... లైన్‌ సైడ్ సిగ్నల్‌ ను ట్యాంపర్‌ చేసి, రైలు ఆగిపోయేలా చేశారు. వెంటనే హెల్మెట్లు, గ్లౌజులు ధరించి, 150 గోనె సంచులతో రైలులోకి ప్రవేశించారు.

సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోకుండా అన్నట్లుగా... ముందుగా రైలు లోకో పైలట్‌, కో పైలట్‌ పై దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత 2.6 మిలియన్‌ పౌండ్లను గోనె సంచుల్లో నింపుకుని దోచేశారు. ప్రస్తుత విలువ ప్రకారం ఆ మొత్తం రూ.500 కోట్లకు సమానంగా ఉంటుందని అంచనా! ఈ దోపిడీ వ్యవహారం మొత్తం 30 నిమిషాల్లో జరిగిపోవడం గమనార్హం.

అనంతరం దోచుకున్న సొమ్మునంతా అప్పటికే కొనుగోలు చేసిపెట్టిన ఒక ఫాంహౌస్‌ కు ల్యాండ్‌ రోవర్‌ కార్లలో తరలించారు. అక్కడ వాటాలు పంచుకున్నారు. తర్వాత సాక్ష్యాధారలు చేకుండా చేయడం కోసం ఆ ఫాం హౌస్ ని ధ్వంసం చేయాలని భావించారు. దీనికోసం ఆరుగుర్ని హైర్ చేసుకున్నారు. అయితే వారు ఆ పని పూర్తిగా సక్రమంగా చేయకపోవడంతో... వేలిముద్రలు దొరికేశాయి!

దీంతో... అప్పటికే మరి కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఈ పింగర్ ప్రింట్స్ సహాయంతో 12 మందిని అరెస్టు చేసి, జైలుకు పంపించారు. అయితే, ఆ ముఠాలోని కీలక వ్యక్తి రోన్నీ బిగ్స్ కొద్దిరోజులకే జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొని ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌ దేశాలన్నీ తిరిగి చివరకు 2001లో యూకేలో అడుగుపెట్టాడు. మళ్లీ పోలీసులకు చిక్కాడు. అతడు 2013లో లండన్‌ లోని ఒక కేర్‌ హోంలో మృతి చెందాడు.

ఇదే క్రమంలో... ఈ దోపిడీకి నాయకత్వం వహించిన బ్రూస్‌ రేనాల్డ్స్‌ అనే వ్యక్తి కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత 2013లోనే మృతి చెందాడు. అయితే ఇతడు 1995లో "ఆటో బయోగ్రఫీ ఆఫ్ థీఫ్‌" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ లిస్ట్ లో మరో నేరస్థుడు రొనాల్డ్‌ ఎడ్వర్డ్స్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత ఫ్లవర్ బొకేలు అమ్ముకుంటూ జీవనం సాగింస్తూ జీవిస్తున్న క్రమంలో... 1994లో సైతం ఉరి వేసుకొని చనిపోయాడు.

ఇలా ఒక్కో దొంగదీ ఒక్కో శాడ్ ఎండింగ్! ఈ క్రమంలో... ఆ బ్యాచ్ లో చివరి వ్యక్తి అయిన బాబీ వెల్చ్‌ ఇటీవల వయోభారం పెరిగి అనారోగ్యంతో మరణించాడు. వాస్తవానికి వెల్చ్‌ కు 30 సంవత్సరాల జైలు శిక్ష పడినప్పటికీ.. 1976లో జైలు నుంచి బయటకు వచ్చి కాలుకు చికిత్స చేయించుకున్నాడూ. అదికాస్తా వికటించడంతో వీల్‌ ఛైర్‌ కే పరిమితమయ్యాడు. ఈ ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నారు.

తాజాగా వెల్చ్ మృతిచెందడంతో ఈ గ్రేట్‌ ట్రైన్‌ రాబరీ వ్యవహారం మరోసారి అంతర్జాతీయ మీడియాలో అచ్చయ్యింది. దీంతో ఈ రాబరీ గురించి తెలిసినవారు నాటి సంఘటనలు నెమరువేసుకుంటుంటే... ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నవారు మాత్రం "ధూమ్" సినిమా యూకేలో 60ల్లోనే జరిగిందా అని అనుకుంటున్నారు! ఇంకొంతమంది మాత్రం "ధూమ్" సినిమాను ఇన్స్పైర్ చేసిన రియల్ స్టోరీ ఇదేనేమో అని కొత్త టచ్ ఇస్తున్నారు!