Begin typing your search above and press return to search.

పర్యాటక వీసాతో వెళ్లడమే పాపం.. ఇది మాటలకందని దారుణం!

భారత్‌ తో సుదీర్ఘ స్నేహ సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో రష్యా ఒకటి అనే సంగతి తెలిసిందే. భారత్‌ కు రష్యా చిరకాల మిత్ర దేశం

By:  Tupaki Desk   |   6 March 2024 5:30 PM GMT
పర్యాటక వీసాతో వెళ్లడమే పాపం.. ఇది మాటలకందని దారుణం!
X

భారత్‌ తో సుదీర్ఘ స్నేహ సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో రష్యా ఒకటి అనే సంగతి తెలిసిందే. భారత్‌ కు రష్యా చిరకాల మిత్ర దేశం. కాగా గత రెండేళ్లుగా వాద్లిమిర్‌ పుతిన్‌ నేతృత్వంలోని రష్యా.. ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్‌ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేరడం ఇష్టం లేని రష్యా.. ఉక్రెయిన్‌ విధ్వంసమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో యుద్ధాన్ని ప్రారంభించి రష్యా రెండేళ్లు అయినా ఆపడం లేదు.

కాగా ఉక్రెయిన్‌ పై మొదట్లో సులువుగా విజయాలు సాధిస్తూ పోయిన రష్యా ఆ తర్వాత గట్టి ఎదురుదెబ్బలు తింది. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు ఆయుధాలు అందించడంతో ఉక్రెయిన్‌ గట్టిగానే పోరాడుతోంది. దీంతో రష్యన్‌ సైనికులు వేలల్లో ఈ యుద్ధంలో మరణించారు.

ఈ నేపథ్యంలో రష్యా తన సైన్యంలోకి బలవంతంగా పౌరులను సైనికులుగా చేర్చుకుంటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు పర్యాటక వీసాపై రష్యా వెళ్లిన భారతీయులను కూడా ఈ యుద్ధంలోకి దింపిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రష్యా సైనం బాధితుల జాబితాలో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. తాజాగా మరో ఏడుగురు భారతీయులు తమను కాపాడాలని భారత విదేశాంగ శాఖకు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు వారు ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి వీడియో విడుదల చేశారు. ఈ ఏడుగురిలో ఐదుగురిది పంజాబ్‌ కాగా.. మరో ఇద్దరిది హరియాణా. కాగా గగన్‌ దీప్‌ సింగ్, లవ్‌ ప్రీత్‌ సింగ్, నరైన్‌ సింగ్, గురప్రీత్‌ సింగ్, హర్‌‡్షకుమార్, అభిషేక్‌ కుమార్‌గా బాధితులను గుర్తించారు. వీరంతా 24 ఏళ్ల లోపువారేనని చెబుతున్నారు.

కాగా ఈ ఏడుగురు బృందంలో ఒకరు పర్యాటక వీసాపై రష్యా వెళ్లగా పోలీసులు అతడిని అదుపులోకి బలవంతంగా సైన్యంలోకి హెల్పర్‌ గా వెళ్లాలని బెదిరించారు. సైన్యంలోకి వెళ్లకపోతే పదేళ్లపాటు జైలులో మగ్గాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమను ముందు హెల్పర్లుగా మాత్రమే చేయాలని చెప్పారని.. ఆ తర్వాత సాయుధ శిక్షణకు తమ పేర్లను నమోదు చేశారని బాధితులు తెలిపారు.

సాయుధ శిక్షణ అందించాక ఉక్రెయిన్‌ లోకి తమను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆహారం పెట్టడం లేదని.. ఫోన్లు కూడా లాక్కున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు పంజాబీ భాషలో వీడియో ద్వారా మాట్లాడారు. సైన్యంలో పనిచేస్తే ఏడాది తర్వాత మీ దేశానికి పంపిస్తామని రష్యన్‌ అధికారులు తెలిపారన్నారు.

అయితే తమకు అక్కడి నుంచి సజీవంగా తిరిగి వస్తామన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా భారత్‌ నుంచి దాదాపు 100 మంది యువకులను ఇలా మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్‌ తో యుద్ధంలోకి దింపారన్న సమాచారంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. ఈ విషయంపై తాము రష్యాతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. అక్కడ పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. అదే సమయంలో భారతీయులు ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.