ఎస్-400: రష్యాలో వైఫల్యం.. భారత్ లో విజయం ఎందుకంటే..?
ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన డ్రోన్ లతో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది.
By: Tupaki Desk | 3 Jun 2025 12:00 AM ISTఆదివారం రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన డ్రోన్ లతో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. ఈ క్రమంలో.. దాదాపు 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో.. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి నిర్వహించారంటూ డ్రోన్ దాడిని జెలెన్ స్కీ కొనియాడారు. ఈ సమయంలో ఎస్-400 క్షిపణిపై చర్చ తెరపైకి వచ్చింది.
అవును... రష్యా ఎస్-400 క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునతన గగనతల రక్షణ వ్యవస్థలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ అనంతరం ఈ క్షిపణి వ్యవస్థ గురించిన చర్చ మరింత ఎక్కువగా జరిగింది. ఈ వ్యవస్థ.. విమానం, క్షిపణులు, డ్రోన్లు వంటి వైమానిక దాడులను అడ్డుకోగలదు. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ డ్రోన్ లు, క్షిపణులను దీని సాయంతో భారత్ సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టింది.
అయితే... తాజాగా ఉక్రెయిన్ డ్రోన్లు ఆ స్థాయిలో తమపై విరుచుకుపడుతుంటే రష్యా ఎందుకు వాటిని ఆపలేకపోయింది? అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఈ సమయంలో రష్యాలోని ఎస్-400 వైఫల్యానికి పలు కారణాలున్నాయని అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా... రష్యా రెగ్యులర్ గా స్వల్ప శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థల సపోర్ట్ లేకుండా ఎస్-400 ను ఒంటరిగా మొహరించిందని.. దీనివల్ల డ్రోన్లు వంటి తక్కువ ఎత్తులో ఎగురుతున్న లక్ష్యాలను అడ్డగించడం కష్టమైందని చెబుతున్నారు.
ఇదే సమయంలో.. ఎస్-400ను నాశనం చేయడానికి ఉక్రెయిన్ సంక్లిష్టమైన వ్యూహాన్ని అనుసరించిందని.. ఇందులో భాగంగా వారు మొదట డ్రోన్ యొక్క రాడార్, యాంటెన్నాను లక్ష్యంగా చేసుకుంటారని.. అనంతరం, క్షిపణులతో దాడి చేస్తారని చెబుతున్నారు. ఈ విధానంవల్ల రష్యా రక్షణ వ్యవస్థలను చొచ్చుకునిపోవడంలో సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఎలక్ట్రానికి వార్ ఫేర్ పద్ధతులను ఉపయోగించి ఎస్-400 రాడార్ సిగ్నల్స్ ను ఉక్రెయిన్ జామ్ చేసిందని అంటున్నారు. దీనివల్ల రక్షణ వ్యవస్థ ఈ లక్ష్యాలను ట్రాక్ చేయలేకపోయిందని చెబుతున్నారు. అదేవిధంగా.. భారత్ చేసినట్లుగా రష్యా ఎస్-400 ను రక్షించడానికి తరచూ తరలించడం లేదా నకిలీ వ్యవస్థలను ముందు పెట్టడం వంటి చర్యలు తీసుకోలేదని.. ఈ నిర్లక్ష్యాన్ని ఉక్రెయిన్ సద్వినియోగం చేసుకుందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు... ఎస్-400 ఇప్పటికీ శక్తివంతమైన వ్యవస్థ అని.. విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించగలదని చెబుతున్నారు. అయితే.. దీన్ని సమర్ధవంతంగా చేయడానికి సరైన మద్దతు వ్యవస్థలతో పాటు వ్యూహం అవసరమని అంటున్నారు. ఈ విషయంలో రష్యా బలహీనతలు ఉక్రెయిన్ సద్వినియోగం చేసుకోగా.. భారత్ మాత్రం ఎస్-400 ని పక్కా వ్యూహాలతో ఉపయోగించుకుందని చెబుతున్నారు.
