Begin typing your search above and press return to search.

రష్యాపై ఉక్రెయిన్ ఈ రేంజ్ లో విరుచుకుపడటం ఫస్ట్ టైమ్.. వీడియోలు వైరల్!

అవిరామంగా కొనసాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఆదివారం నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగా... రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన డ్రోన్ లతో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 1:57 AM IST
రష్యాపై ఉక్రెయిన్ ఈ రేంజ్ లో విరుచుకుపడటం ఫస్ట్ టైమ్.. వీడియోలు వైరల్!
X

రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రమవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఓ పక్క ఇరుదేశాల మధ్య చర్చకు అమెరికా ప్రయత్నిస్తున్నా.. అందుకు ఇద్దరూ సరే సరే అంటున్నట్లు కనిపిస్తున్నా.. జరిగే దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ సమయంలో రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడింది.

అవును.. అవిరామంగా కొనసాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఆదివారం నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగా... రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన డ్రోన్ లతో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. దీంతో..ఇంత భారీ మొత్తంలో ఉక్రెయిన్ దాడులకు పాల్పడటం ఇదే తొలిసారని అంటున్నారు. ఈ దాడులను రష్యా ధృవీకరించింది!

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం... తాజాగా ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ లో 40కి పైగా రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ లు ధ్వంసమయ్యాయి. ఇందులో టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్ క్రాఫ్ట్ లు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది! ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ ఇలా భారీ స్థాయిలో దాడులకు తెగబడటం ఇదే తొలిసారి.

అయితే... ఈ డ్రోన్ల దాడిలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించినట్లు తక్షణ నివేదికలు లేవని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను రష్యా మీడియాలోనూ ప్రసారమయ్యాయి.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ తో చర్చలకు రష్యా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇస్తాంబుల్ లో సోమవారం ఇరుదేశాల నేతలు సమావేశమవ్వాలని కోరింది. దీంతో.. ఈ ప్రతిపాదనలకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రెసిడెంట్ జెలెన్ స్కీ.. మంత్రి రుస్టెమ్ నేతృత్వంలోని బృందం సోమవారం ఇస్తాంబుల్ కు చేరుకుంటుందని తెలిపారు.

కాగా మే 16న ఉక్రెయిన్ - రష్యా మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాల్పుల విరమణకు సంబంధించిన నిబంధనలను వివరిస్తూ మాస్కో ఒక మెమోరాండంను రూపొందించింది. అయితే.. దాన్ని ఉక్రెయిన్ తో పంచుకోలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ తెలిపారు. ఇస్తాంబుల్ లో వీటిపై క్లారిటీ రావొచ్చని అంటున్నారు!