Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్-రష్యా సైనికుల ఊచకోత.. గంటకు 60 మంది ప్రాణాలు బలి

ఓవైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు భీకరమైన దాడులు జరుగుతున్నాయి.. ఓవైపు నాయకులు యుద్ధం విరమణపై ప్రకటనలు చేస్తున్నారు.. మరోవైపు సైనికుల ప్రాణాలు పోతున్నాయి..

By:  Tupaki Desk   |   3 Jun 2025 5:30 PM IST
ఉక్రెయిన్-రష్యా సైనికుల ఊచకోత.. గంటకు 60 మంది ప్రాణాలు బలి
X

ఓవైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు భీకరమైన దాడులు జరుగుతున్నాయి.. ఓవైపు నాయకులు యుద్ధం విరమణపై ప్రకటనలు చేస్తున్నారు.. మరోవైపు సైనికుల ప్రాణాలు పోతున్నాయి.. ఓవైపు యుద్ధ ఖైదీల మార్పిడి జరుగుతుండగా.. మరోవైపు అణు బాంబు దాడుల హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఇంతకూ ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఏం జరుగుతోంది...?

మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో ఆదివారం ఉక్రెయిన్ ఓ సాహసానికి ఒడిగట్టింది. రష్యా భూభాగంలోకి వెయ్యి కిలోమీటర్లు చొచ్చుకెళ్లి.. సీక్రెట్ ఆపరేషన్ ద్వారా బాంబర్లను ధ్వంసం చేసింది. కేవలం రూ.45 వేల ఖరీదు చేసే 472 డ్రోన్లను వాడింది. దీనికి ప్రతిగా రష్యా కూడా ఉక్రెయిన్ మీద బాంబులు వేసింది. అయితే, రష్యాకు ఉక్రెయిన్ చేసిన నష్టమే ఎక్కువ. ఇదంతా తుర్కియేలో

చర్చలు జరుగుతుండగానే కావడం గమనార్హం. ఉక్రెయిన్ తాజా దాడిని రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాలోని పెరల్ హార్బర్ పై జపాన్ చేసిన దాడితో దీనిని పోలుస్తున్నారు. ఈ దాడి తర్వాతే అమెరికా అణు బాంబు ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా రష్యా తాము చేసిన దాడుల్లో 24 గంటల్లో 1,430 మంది ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. అంటే గంటకు 60 మందిని చంపినట్లు అన్నమాట. ప్రతిగా రష్యాకు చెందిన పది లక్షల మంది సైనికులను మూడేళ్లలో తాము హతమార్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇందులో 1100 మందిని గత 24 గంటల్లో చంపినట్లు పేర్కొంది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై డ్రోన్లు, క్షిపణులు, సాయుధ పోరాట వాహనాలు, ఫిరంగి తుపాకులను ధ్వంసం చేసినట్టు రష్యా పేర్కొంటోంది. ఇప్పటివరకు తాము రష్యాకు చెందిన 10,811 ట్యాంకులు,22,671 సాయుధ పోరాట వాహనాలు, 50,607 ఇంధన ట్యాంకులు, 28,623 ఫిరంగి వ్యవస్థలు, 1,402 రాకెట్ ప్రయోగ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. 1,176 వైమానిక రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 41 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, 38,748 డ్రోన్లు, 28 నౌకలు, జలాంతర్గామిని దెబ్బతీశామని టిట్ ఫర్ టాట్ లాగా ప్రకటించింది.

తుర్కియేలో సోమవారం రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య కాల్పుల విరమణ చర్చలు జరిగాయి. కానీ, అవి ఫలవంతం కాలేదు.