Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. పుతిన్ అణుదాడికి దిగుతారా ? ప్రపంచంలో పెరిగిన భయాందోళనలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. జూన్ 2న ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, ఆదివారం ఉక్రెయిన్ రష్యా భూభాగంపై కొన్ని ప్రాంతాల్లో భారీ డ్రోన్ దాడులు చేసింది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 12:21 PM IST
ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. పుతిన్ అణుదాడికి దిగుతారా ? ప్రపంచంలో పెరిగిన భయాందోళనలు
X

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. జూన్ 2న ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, ఆదివారం ఉక్రెయిన్ రష్యా భూభాగంపై కొన్ని ప్రాంతాల్లో భారీ డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అణు ఆయుధాలను ఉపయోగించవచ్చని ప్రపంచవ్యాప్త ఆందోళనలను పెంచాయి. ఈ తాజా పరిణామాలు యుద్ధం తీవ్రతను, అణు యుద్ధం వచ్చే అవకాశంపై భయాందోళనలను మరింత పెంచుతున్నాయి.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ (Russia’s Defence Ministry) ప్రకారం, ఉక్రెయిన్ డ్రోన్‌లు ఐదు రష్యా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో అణు సామర్థ్యం కలిగిన TU-95, Tu-22 వంటి స్ట్రాటజిక్ బాంబర్స్(strategic bombers) సహా సుమారు 40 రష్యన్ విమానాలను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ (Ukraine) ప్రకటించింది. ఉక్రెయిన్ భద్రతా సేవ, ఎస్‌బీయు (SBU) ఈ దాడులను 11 నెలల పాటు ప్లాన్ చేసినట్లు నివేదించింది. ఓలెనెగార్స్క్ (Murmansk ప్రాంతంలో), బెలాయా (Irkutsk ప్రాంతంలో) ఎయిర్‌బేస్‌లలో విమానాలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. మొత్తంమీద, 117 డ్రోన్‌లను ఈ దాడికి ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) స్వయంగా వెల్లడించారు.

ఈ దాడులు రెండో విడత శాంతి చర్చలకు ముందు మాస్కోపై ఒత్తిడి పెంచడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ చేస్తున్న ప్రయత్నంగా పరిశీలకులు భావిస్తున్నారు. రష్యా ప్రతినిధి బృందం, క్రెమ్లిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్‌స్కీ (Vladimir Medynsky) నేతృత్వంలో.. ఇప్పటికే చర్చల కోసం టర్కీ చేరుకుంది. అయితే, తక్షణ కాల్పుల విరమణ (ceasefire) కుదిరే అవకాశంపై నిపుణులు ఆశలు పెట్టుకోవడం లేదు. సోమవారం జరిగిన చర్చల్లో ఇరు పక్షాలు ఖైదీల మార్పిడి గురించి మాత్రమే ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయి. పూర్తి కాల్పుల విరమణపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.

ఎకనామిక్ టైమ్స్ (Economic Times) నివేదిక ప్రకారం, మే 4న ఒక ప్రభుత్వ టీవీ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో అణు ఆయుధాలను ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు రాలేదని, అలాగే అది కొనసాగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. నవంబర్ 2024లో పుతిన్ రష్యా అణు విధానాన్ని అప్‌డేట్ చేశారు. అణు ఆయుధాలు కలిగిన దేశం మద్దతుతో సాంప్రదాయ దాడి (conventional attack) జరిగినా కూడా అణు ఆయుధాలను ఉపయోగించడానికి ఇది అనుమతిస్తుంది.