Begin typing your search above and press return to search.

రష్యాపై డ్రోన్ దాడికి పేరు పెట్టిన జెలెన్ స్కీ.. ఆసక్తికర వ్యాఖ్యలు!

రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన డ్రోన్ లతో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 2:20 PM IST
Ukraine Launches Massive Drone Strikes on Russian Airbases
X

రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన డ్రోన్ లతో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. దీంతో.. ఇంత భారీ మొత్తంలో ఉక్రెయిన్ దాడులకు పాల్పడటం ఇదే తొలిసారని అంటున్నారు. తాజాగా ఈ దాడులపై జెలెన్ స్కీ స్పందించారు.

అవును... ఆదివారం ఇర్క్యూట్స్ ప్రాంతంలోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో దాదాపు 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు ర్యాజన్, ముర్మన్స్క్ ప్రాంతంలోనూ ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని అటు రష్యన్ అధికారులు ధృవీకరించారు. ఈ సమయంలో తన సైన్యాన్ని కొనియాడుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు.

ఇందులో భాగంగా... రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి నిర్వహించిన డ్రోన్ దాడిని జెలెన్ స్కీ కొనియాడారు. 'ఎక్స్' వేదికగా స్పందించిన ఆయన... తమ సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయని అన్నారు. రష్యాకు చెందిన 40 విమానాలను ధ్వంసం చేసిన ఈ దాడికి "స్పైడర్ వెబ్" గా పేరుపెట్టినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఇప్పుడే మా స్పెషల్ ఫోర్స్ అధిపతి వాసిల్ మలియుక్ అద్భుతమైన ఆపరేషన్ గురించి వెల్లడించారని.. ఇది పూర్తిగా శత్రు భూభాగంగలో లక్ష్యాలపై జరిగిందని.. ఉక్రెయిన్ పై దాడులకు వాడుతున్న ఆయుధాలను ఎంపిక చేసి మరీ ధ్వంసం చేశామని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే.. రష్యాకు ఇది చాలా తీవ్రమైన నష్టమని, వారికి ఇలా జరగాల్సిందే అని చెప్పిన జెలెన్ స్కీ... ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు చెందిన సెక్యూరిటీ సర్వీసెస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక... ఈ దాడులపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ తో చర్చలకు రష్యా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇస్తాంబుల్ లో సోమవారం ఇరుదేశాల నేతలు సమావేశమవ్వాలని కోరింది. దీంతో.. ఈ ప్రతిపాదనలకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రెసిడెంట్ జెలెన్ స్కీ.. మంత్రి రుస్టెమ్ నేతృత్వంలోని బృందం ఇస్తాంబుల్ కు చేరుకుంటుందని తెలిపారు.