ఎంతమందిని చంపితే అన్ని ప్రైజ్ లు..ఉక్రెయిన్ బంపర్ ఆఫర్
యుద్ధంలో రష్యన్ సైనికులను చంపినా లేదా వారి సైనిక పరికరాలను ధ్వంసం చేసినా సైనికులకు పాయింట్లు ఇస్తారు.
By: Tupaki Desk | 3 May 2025 4:00 AM ISTరష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ ఒక వినూత్నమైన పథకాన్ని ప్రారంభించింది. తమ సైనికులు రష్యన్ సైనికులను చంపినా లేదా వారి సైనిక పరికరాలను ధ్వంసం చేసినా వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ బహుమతులతో సైనికులు ఇప్పుడు డ్రోన్లు, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయవచ్చు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమానికి Brave1 Market అని పేరు పెట్టింది. ఇది ఒక ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ సైనిక సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రి మిఖైలో ఫెడోరోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సైనికుల కోసం ఒక కొత్త వేదికను ప్రారంభించినట్లు తెలిపారు. Brave1 Marketలో సైనికులకు డ్రోన్లు, రోబోట్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రి వంటి అధునాతన సైనిక సాంకేతిక పరికరాలు లభిస్తాయి. ఈ వేదిక ఇతర ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌ల మాదిరిగానే పనిచేస్తుంది, కానీ Brave1 Marketలో సాధారణ వస్తువులు కాకుండా సైనిక పరికరాలు అమ్ముడవుతాయి.
పాయింట్లు ఎలా వస్తాయి? వాటితో ఏం కొనొచ్చు?
యుద్ధంలో రష్యన్ సైనికులను చంపినా లేదా వారి సైనిక పరికరాలను ధ్వంసం చేసినా సైనికులకు పాయింట్లు ఇస్తారు. దీని కోసం వారు డ్రోన్ ఫుటేజ్ ద్వారా దాడిని ధృవీకరించాలి. ఆ ఫుటేజ్‌ను తర్వాత సైనిక నెట్‌వర్క్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రతి రష్యన్ సైనికుడిని చంపినందుకు ఆరు పాయింట్లు లభిస్తాయి. ఒక ట్యాంక్‌ను ధ్వంసం చేస్తే 40 పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లను Brave1 Marketలో సైనిక పరికరాలు కొనడానికి ఉపయోగించవచ్చు.
ఎవరికి ఏమి లభిస్తుంది?
ఇప్పటివరకు Brave1 Marketలో డ్రోన్లు, గ్రౌండ్ రోబోట్లు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలతో సహా 1,000 కంటే ఎక్కువ రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఉక్రెయిన్ సైనికులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ పరికరాలను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు.. బాగా పాపులర్ అయిన బాంబుల డ్రోన్ బాబా యగా దాదాపు 43 పాయింట్లకు లభిస్తుంది.
సైనికులకు కొత్త ఆశ
ఉక్రెయిన్ సైన్యం "బర్డ్స్ ఆఫ్ ఫ్యూరీ" అనే డ్రోన్ యూనిట్ ఈ కార్యక్రమం ద్వారా అత్యధిక పాయింట్లను సంపాదించింది. వారి వద్ద ఇప్పుడు వందల కొద్దీ డ్రోన్లను కొనడానికి తగినన్ని పాయింట్లు ఉన్నాయి. ఈ వేదిక ద్వారా సైనికులకు వారి అవసరమైన పరికరాలు సులభంగా అందుబాటులో ఉంటాయని, ఇది సైనిక కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేస్తుందని ఉక్రెయిన్ చెబుతోంది. ఈ కార్యక్రమం ఉక్రెయిన్ సైన్యానికి ఒక పవర్ ఫుల్ అడుగని చెప్పొచ్చు. థఈఎందుకంటే ఇది వారికి ఎక్కువ సైనిక శక్తిని అందిస్తుంది.
