ఇజ్రాయెల్ తెగింపు.. ఇద్దరు యూకే ఎంపీల నిర్బంధం
ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ పార్లమెంటు సభ్యులను (ఎంపీలు) ఇజ్రాయెల్ అధికారులు అడ్డుకుని నిర్బంధించడం తీవ్ర దుమారం రేపుతోంది.
By: Tupaki Desk | 6 April 2025 3:55 PM ISTఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ పార్లమెంటు సభ్యులను (ఎంపీలు) ఇజ్రాయెల్ అధికారులు అడ్డుకుని నిర్బంధించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను బ్రిటన్ తీవ్రంగా పరిగణిస్తోంది. యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ఈ చర్యను ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఖండించారు. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్, అబ్తిసామ్ మొహమ్మద్ అనే ఇద్దరు మహిళా ఎంపీలు శనివారం లండన్‌లోని లుటాన్ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. యువాన్ యాంగ్ ఎర్లీ, వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అబ్తిసామ్ మొహమ్మద్ షెఫీల్డ్ సెంట్రల్‌కు ఎంపీగా ఉన్నారు. టెల్‌అవీవ్‌లోని విమానాశ్రయంలో దిగిన వెంటనే ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అయితే కొంత సమయం తర్వాత వారిని విడుదల చేశారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించింది. తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఆరోపించింది. అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇజ్రాయెల్ చర్యపై యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా స్పందించారు. "ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన యూకే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు స్పష్టం చేశాను" అని లామీ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం ఇజ్రాయెల్ - హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి కీలకమైన అంశాలపై దృష్టి సారించిందని లామీ స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో యూకే ఎంపీలను నిర్బంధించడం ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇద్దరు యూకే ఎంపీలను నిర్బంధించిన ఘటనను బ్రిటన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇజ్రాయెల్‌తో ఉన్నత స్థాయిలో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఒకవైపు గాజాలో శాంతి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.
