ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ఓటుహక్కు 16 ఏళ్లకే
తాజాగా తాము ఇచ్చిన హామీకి తగ్గట్లే.. ఎన్నికల్లో ఓటు వేసే హక్కును ఇప్పుడున్న 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 18 July 2025 12:00 PM ISTఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే..ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయటం అంత తేలికైన విషయం కాదు. దీనికి ఉండే పరిమితులు అన్నిఇన్ని కావు. అధకారానికి దూరంగా ఉంటూ ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ.. తాము పవర్లోకి వస్తే..కొండ మీద కోతిని కూడా దించి తీసుకోస్తామన్నట్లుగా పార్టీల హామీలు వినిపిస్తుంటాయి. అలాంటిది బ్రిటన్ లో అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రస్తుతం ఆ దేశంలో ఓటుహక్కు 18 ఏళ్లు నిండిన వారికే ఉంది. అయితే.. ఈ మధ్యనే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు అధికారం లభిస్తే.. తాము పదహారేళ్లకే ఓటుహక్కు కల్పిస్తామని స్పష్టం చేసింది. గత ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయాన్ని సాధించటంతో.. ఈ హామీ అమలు కీలకమైంది.
తాజాగా తాము ఇచ్చిన హామీకి తగ్గట్లే.. ఎన్నికల్లో ఓటు వేసే హక్కును ఇప్పుడున్న 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఓటు వేసే వయసును తగ్గించటాన్ని బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి పెద్దమార్పుగా అభివర్ణిస్తున్నారు.
యూకేలో ఓటర్ ఐడీ వ్యవస్థను సైతం విస్తరించాలని భావిస్తున్నారు. బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డులని సైతం పోలింగ్ బూత్ లలో గుర్తింపు కార్డులుగా పరిగణలోకి తీసుకోనున్నారు. ఎందుకీ నిర్ణయం అంటే.. ఓటు వేసే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటుహక్కును వినియోగించటానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచి పెట్టకుండా తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
