యూకేలో నివాసం ఇక కష్టమే.. కొత్త బిల్లులో కీలక మార్పులు ఇవే..
బ్రిటన్ గడ్డపై శాశ్వత నివాసం పొందాలనే కల మరింత సుదీర్ఘమైన, కఠినంగా మారింది.
By: Tupaki Desk | 21 Nov 2025 3:00 PM ISTబ్రిటన్ గడ్డపై శాశ్వత నివాసం పొందాలనే కల మరింత సుదీర్ఘమైన, కఠినంగా మారింది. అంతర్జాతీయ వలసదారుల విధానంలో యూకే ప్రభుత్వం తీసుకురాబోతున్న కీలక మార్పులు.. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి వెళ్లిన వేలాది మంది ప్రజల భవిష్యత్తుపై ఇదొక పిడుగుగా మారింది. హోం మంత్రి షబానా మహమూద్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన ‘ఎర్న్‌డ్ సెటిల్‌మెంట్ (Earned Settlement)’ ప్రతిపాదన, ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఐదేళ్ల ఆటోమేటిక్ ఐఎల్‌ఆర్ విధానాన్ని కనీసం పదేళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పు కేవలం కాలపరిమితి పెంపు మాత్రమే కాదు.. వలసదారుల ‘విలువ’ను, ‘సమస్య’ను ఒకే త్రాసులో తూచే ప్రయత్నంగా కనిపిస్తోంది.
సాధారణం పదేళ్లు, అత్యధికంగా 15-20 ఏళ్లు
‘స్థిర నివాసం అనేది ప్రతి కుటుంబం హక్కు పైగా దీనితో గౌరవం కూడా అందుతుంది. ఈ సిద్ధాంతంపై ఈ విధానం రూపొందించబడింది. ఇంతకు ముందు, నైపుణ్యం కలిగిన కార్మికులు కేవలం ఐదేళ్ల నివాసం తర్వాత ఐఎల్‌ఆర్ కోసం దరఖాస్తు చేసుకోగలిగేవారు. కానీ, కొత్త ప్రతిపాదనల ప్రకారం.. చాలా మంది వలసదారులు కనీసం పదేళ్లు వేచి ఉండాల్సిందే. అంతేకాకుండా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలపై ఈ భారం మరింత ఎక్కువగా పడుతుంది.
*తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు
తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు కనీసం 15 ఏళ్లు నిరీక్షించాల్సి ఉంటుంది. వీరిలో చాలా మంది ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవ రంగాల్లో పనిచేసేవారు ఉన్నారు.
*ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులు
వీరు 20 ఏళ్ల వరకు నిరీక్షించాల్సి రావచ్చు. అత్యంత దారుణంగా, అక్రమంగా ప్రవేశించిన లేదా వీసా గడువు ముగిసిన వారు 30 ఏళ్ల వరకు వేచి ఉండాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
ఈ బిల్లులోని నిబందనలు ప్రధానంగా భారతదేశం వంటి దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది, ఎందుకంటే ఇటీవల కాలంలో యూకేకి వెళ్లిన వలసదారులలో వీరే అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
నైపుణ్యానికి ప్రాధాన్యత
అదే సమయంలో, యూకే ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా ‘సహకారం’ అందిస్తున్నారని భావించే వర్గాలకు మాత్రం ఈ నిబంధనల నుంచి కొన్ని మినహాయింపులు దక్కాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) నిపుణులు (డాక్టర్లు, నర్సులు) మునుపటి మాదిరిగానే ఐదేళ్లలో ఐఎల్‌ఆర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధిక సంపాదన ఉన్నవారు సంవత్సరానికి $50,270 (సుమారు ₹50 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించేవారు ఐదేళ్లలో, $125,140 (సుమారు ₹1.2 కోట్లు) కంటే ఎక్కువ సంపాదించేవారు కేవలం మూడేళ్లలోనే శాశ్వత నివాసం పొందే వేగవంతమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మినహాయింపులు, దేశానికి ఆర్థికంగా లేదా కీలక సేవల పరంగా అధిక విలువను జోడించేవారిని యూకేలో నిలుపుకోవడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోందని స్పష్టం చేస్తున్నాయి.
విధానపరమైన సమీక్ష:
ఈ ‘ఎర్న్‌డ్ సెటిల్‌మెంట్’ విధానం వలసదారులను కేవలం ఆర్థిక సాధనంగా మాత్రమే చూసే ప్రమాదం ఉంది. ఒక వలసదారుడి ‘విలువ’ను వారి జీతం లేదా ప్రభుత్వ పథకాలపై ఆధారపడడం ద్వారా మాత్రమే కొలవడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న ప్రస్తుతం దేశ వాసులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతుంది.
అనిశ్చితిని పెంచడం
15 లేదంటే 20 ఏళ్ల నిరీక్షణ అంటే, ఆ వ్యక్తులు ఆ సుదీర్ఘ కాలమంతా అనిశ్చితిలో జీవించాల్సి వస్తుంది. తరచుగా వీసా పొడిగింపులు, అధిక దరఖాస్తు ఫీజులు, నిరంతర నియంత్రణ వారి మానసిక, ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
ఈ ప్రతిపాదనలు వలసదారులను వారి ‘సామాజిక సహకారం’ (క్రిమినల్ రికార్డు లేకపోవడం, ఇంగ్లిష్ పరిజ్ఞానం, పన్ను చెల్లింపులు) ఆధారంగా వేరు చేస్తాయి. అయితే, దీని వెనుక ఉన్న అంతిమ లక్ష్యం యూకే వలస విధానాన్ని ‘అదుపు’లో ఉంచడం అంటూ వినిపిస్తున్నాయి.
నిస్సందేహంగా, ఇది యూకే వలస విధానంలో గత అర్ధ శతాబ్దంలోనే అతిపెద్ద మార్పుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ కఠినమైన నిబంధనలు, ముఖ్యంగా తక్కువ వేతన కార్మికులు, సామాజిక సంక్షేమ పథకాలపై ఆధారపడిన వారికి, శాశ్వత నివాసం అనే కలని అసాధ్యం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, యూకేలో స్థిరపడాలనుకునే ప్రతి అంతర్జాతీయ వలసదారుడు ఈ కొత్త, సుదీర్ఘమైన నిరీక్షణకు సిద్ధం కావాల్సిందే.
