కేరళకు చేరుకున్న బ్రిటీష్ ఇంజినీర్లు.. యూకే F-35 ప్యాకప్
బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35బీ (F-35B) యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 July 2025 5:02 PM ISTబ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35బీ (F-35B) యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ విమానానికి మరమ్మతులు చేసి, తిరిగి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో ఫైటర్ జెట్ మరమ్మతు పనులను చేపట్టేందుకు యూకే నుంచి 24 మంది ఏవియేషన్ ఇంజినీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో ఆదివారం రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో కేరళకు చేరుకుంది. దీంతో విమానాన్ని మరమ్మత్తుల కోసం హ్యాంగర్‌కు తరలించారు. రానున్న రోజుల్లో దీన్ని సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానంలో తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బ్రిటీష్ హైకమిషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.., అవసరమైన అన్ని మరమ్మతులు, భద్రతా తనిఖీల తర్వాత విమానం తిరిగి సేవలను ప్రారంభిస్తుంది. దీనివల్ల ఇతర విమానాల షెడ్యూల్ నిర్వహణకు ఎటువంటి అంతరాయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తిరువనంతపురం విమానాశ్రయంలో ఉన్న ఎఫ్-35బీ ఫైటర్ జెట్‌కు భారీ భద్రత కల్పించామని, సాయుధ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది కాపలాగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
గత నెల ఇండో-యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జూన్ 14న అర్ధరాత్రి దాటిన తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో దీన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరతతో అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చినా, ఆ తర్వాత యూకే అధికారులు ఫైటర్ జెట్‌లో ఇంజినీరింగ్ సమస్య ఉందని స్పష్టం చేశారు. దీనికి మరమ్మతులు చేయడానికి అదే రోజు రాత్రి ఏడబ్ల్యూ101 మెర్లిన్ హెలికాఫ్టర్‌లో నిపుణులు వచ్చారు. మరమ్మతులు చేసినా విమానం తిరిగి పనిచేయకపోవడంతో అప్పటి నుంచి ఈ ఫైటర్ జెట్ ఎయిర్‌పోర్టులోనే ఉంది.