Begin typing your search above and press return to search.

ఎయిర్ లిఫ్టే దారి... కేరళలో నిలిచిన బ్రిటన్‌ ఎఫ్‌-35 తాజా పరిస్థితి ఇదే!

బ్రిటన్‌ కు చెందిన శక్తిమంతమైన ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-35బి విమానం ఒకటి సుమారు రెండు వారాలకు పైగా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 July 2025 11:00 PM IST
ఎయిర్ లిఫ్టే దారి... కేరళలో  నిలిచిన బ్రిటన్‌  ఎఫ్‌-35 తాజా పరిస్థితి ఇదే!
X

బ్రిటన్‌ కు చెందిన శక్తిమంతమైన ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-35బి విమానం ఒకటి సుమారు రెండు వారాలకు పైగా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని తిరిగి తమదేశానికి తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఎన్ని చేసినా అది మొరాయిస్తూనే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ లిఫ్ట్ ఒక్కటే దారి అని అంటున్నారు!

అవును... జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కేరళ తీరం సమీపంలో ఎఫ్‌-35 విమానంలో సమస్య మొదలవ్వడంతో.. దన్ని తిరువనంతపురం ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే... తక్కువ ఫ్యుయల్ వల్ల తిరువనంతపురంలో ల్యాండ్ చేశారని తొలుత భావించారు. అయితే.. రోజులు గడుస్తున్న కొద్దీ అది అక్కడే ఉండిపోయింది.

ఈ సమయంలో... దీనికి మరమ్మతులు చేయడానికి అదే రోజు రాత్రి నిపుణులు వచ్చారు. వారు మరమ్మతులు నిర్వహించినా విమానం మొరాయించిందని అంటున్నారు. అప్పటి నుంచి అది అక్కడే ఉంది. దీంతో యూకే నుంచి స్పెషలిస్టులను పిలిపించారు. ఇందులో భాగంగా... యూకే నుంచి సుమారు 40 మంది నిపుణుల బృందం తిరువనంతపురం వచ్చింది.

అయినప్పటికీ... ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో దీని మరమ్మతు సాధ్యం కావట్లేదని అంటున్నారు. దీంతో ఈ యుద్ధ విమానాన్ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసేందుకు బ్రిటిష్‌ నేవీ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికోసం ఓ పెద్ద విమానాన్ని తిరువనంతపురానికి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఆ విమానాన్ని పార్టులుగా విడదీసి తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ విమానం ఇన్ని రోజులగా ఎయిర్‌ పోర్టులో నిలిపినందుకు గానూ.. పార్కింగ్‌, హ్యాంగర్‌ బకాయిలను భారత్‌ కు చెల్లిస్తామని యూకే నేవీ తెలిపినట్లు సమాచారం. అయితే, అది ఎంత మొత్తం అనేది తెలియాల్సి ఉంది. ఈ విమానానికి ఆ రోజు నుంచి సీ.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బంది సెక్యూరిటీ కల్పిస్తున్నారని చెబుతున్నారు!