ఆ బ్రిటన్ ఫైటర్ జెట్ ను కేరళ సర్కారు వాడేసింది.. అదీ ఓ రేంజ్ లో
అయితే, బ్రిటన్ కు చెందిన ఎఫ్ 35బి అనే ఫైటర్ జెట్ 20 రోజులుగా మన దేశంలోని కేరళలోనే నిలిచిపోయింది.
By: Tupaki Desk | 3 July 2025 10:00 PM ISTఏ దేశమైనా తమ సైనిక ఆయుధాలు, వాహనాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.. శక్తిమంతమైనవి అయితే.. ఇంకా భద్రంగా చూస్తుంది.. అయితే, బ్రిటన్ కు చెందిన ఎఫ్ 35బి అనే ఫైటర్ జెట్ 20 రోజులుగా మన దేశంలోని కేరళలోనే నిలిచిపోయింది. సరిగ్గా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటున్న సమయంలో బ్రిటన్ ఫైటర్ జెట్ కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోవడం అప్పట్లో కలకలం రేపింది. అయితే, సాంకేతిక కారణాల కారణంగానే ఇలా జరిగిందని స్పష్టమైంది.
ఫైటర్ జెట్ ను తరలించడం కష్టం అని తేలిపోయింది. మరమ్మతు కోసం ఆ దేశం నుంచి నిపుణులు వచ్చినా కదిలించలేని పరిస్థితి. దీంతో బ్రిటన్ నౌకా దళం ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది. ఏకంగా ఫైటర్ జెట్ ను ఎయిర్ లిఫ్ట్ చేయాలని చూస్తోంది.
ఫైటర్ జెట్ వంటి భారీ సైనిక వాహనాన్ని తరలించాలంటే అతిపెద్ద సీ17 గ్లోబ్ మాస్టర్ వంటి విమానమే దిక్కు. అంతేకాదు.. ఫైటర్ జెట్ భాగాలను విడదీసి తరలించాలని చూస్తోందట. ఇక విమానాన్ని కొనడం అందరూ చేస్తారు.. దాని పార్కింగ్ ఖర్చు తడిసి మోపెడు అవుతుందని చెబుతారు. ఇప్పుడు ఎఫ్ 35బి విషయంలోనూ అదే జరుగుతోంది. దాదాపు 20 రోజుల పార్కింగ్ ఖర్చులు చెల్లించేందుకు బ్రిటన్ ఒప్పుకొన్నట్లు సమాచారం.
అసలు ఈ ఫైటర్ జెట్ ఇండోనేసియాతో సంయుక్త విన్యాసాలలో పాల్గొని వస్తుండగా సమస్య తలెత్తింది. జూన్ 14 నుంచి తిరువనంతపురంలోనే ఉండిపోయింది. వాతావరణం, ఇంధనం అయిపోవడం వంటి కారణాలు చెప్పినా.. చివరకు టెక్నికల్ సమస్య అని తేలింది.
ఎఫ్ 35... అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధ విమానం. షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ దీని ప్రత్యేకత. అమెరికా, చైనా వంటి అతికొద్ది దేశాలకే ఐదో తరం యుద్ధ విమానాలు ఉన్నాయి.
ఇక దేవతల నివాసంగా పేర్కొనే కేరళ అంటేనే పర్యాటకానికి ప్రసిద్ధి. అలాంటి రాష్ట్రం అరుదైన యుద్ధ విమానం రోజుల తరబడి నిలిచిపోతే ఊరుకుంటుందా..? తమ పర్యాటకానికి దీనినీ వాడేసింది టూరిజం శాఖ. ‘‘కేరళ ఓ అద్భుత ప్రదేశం. నాకు వెళ్లాలని లేదు. కచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సందర్శించండి’’ అంటూ ఫైటర్ జెట్ రివ్యూ ఇచ్చినట్లు పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
