ఉజ్వల్ నికమ్ రాజకీయ రంగ ప్రవేశం, 1993 ముంబయి పేలుళ్లపై సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటన తర్వాత సంజయ్ దత్‌పై టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ (టాడా) చట్టం కింద ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి.
By: Tupaki Desk | 15 July 2025 1:03 PM ISTదాదాపు మూడు దశాబ్దాల క్రితం దేశాన్ని వణికించిన 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇటీవల రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన నికమ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి పేలుళ్ల ఘటనలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
-సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే పేలుళ్లు జరిగేవి కావు..!
1993 మార్చి 12న ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనకు కొద్ది రోజుల ముందే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇంటికి అండర్‌వర్‌ల్డ్ మాఫియా దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూసలేం తీసుకువచ్చిన ఆయుధాల వ్యాన్ వచ్చింది. అందులో ఏకే 47లు, హ్యాండ్ గ్రనేడ్లు, తుపాకులు ఉన్నట్లు నికమ్ తెలిపారు. సంజయ్ దత్ వాటిలో ఒక్క ఏకే 47ను తన వద్ద ఉంచుకొని, మిగతా ఆయుధాలను తిరిగి ఇచ్చేశారని చెప్పారు. కానీ ఆయుధాల వ్యాన్ గురించి అప్పుడే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే, పోలీసులు దర్యాప్తు చేసి పేలుళ్లను ముందుగానే అడ్డుకోగలిగేవారని ఉజ్వల్ నికమ్ స్పష్టం చేశారు.
-సంజయ్ దత్‌పై ఉన్న కేసు పరిణామాలు
ఈ ఘటన తర్వాత సంజయ్ దత్‌పై టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ (టాడా) చట్టం కింద ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. అయితే కోర్టు సంజయ్ దత్‌ను టాడా ఆరోపణల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. కానీ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పుణె యరవాడ జైల్లో శిక్ష అనుభవించిన ఆయన 2016లో విడుదలయ్యారు.
-ఉజ్వల్ నికమ్.. న్యాయరంగంలో విలక్షణ సేవలు
ఉజ్వల్ నికమ్ భారతదేశంలోని అత్యంత ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్లలో ఒకరు. ఆయన 1993 ముంబయి బాంబు పేలుళ్లు, టి-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008 ముంబయి ఉగ్రదాడులు, 2013 ముంబయి గ్యాంగ్ రేప్, 2016 కోపర్దీ గ్యాంగ్ రేప్ వంటి అనేక ఘోర నేరాలలో నిందితులను శిక్షింపజేయడంలో కీలక పాత్ర పోషించారు. ముంబయి దాడుల్లో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడేలా న్యాయపరమైన వాదనలు వినిపించిన ఘనత నికమ్‌దే. ఆయనకు భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆయన జీవితం ఆధారంగా 2017లో ‘ఆదేశ్ – ది పవర్ ఆఫ్ లా’ అనే బయోపిక్ కూడా రూపొందించబడింది.
-రాజకీయాల్లోకి అడుగులు.. రాజ్యసభకు ఎంపిక
2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తరఫున ఉత్తర-మధ్య ముంబయి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నికమ్, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల కేంద్రం ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేయడం గమనార్హం.
దేశభద్రత, న్యాయవ్యవస్థలపై లోతైన అవగాహన ఉన్న ఉజ్వల్ నికమ్ రాజ్యసభలో కీలక పాత్ర పోషించవచ్చునన్న అంచనాలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
