Begin typing your search above and press return to search.

చింపాంజీల మధ్య గ్రూప్ వార్? ఇదే విచిత్రం అనుకోకండి నిజమే...

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ యుద్ధాలకు ప్రధాన కారణం ప్రాంతీయ ఆధిపత్యం అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   11 April 2026 3:12 PM IST
చింపాంజీల మధ్య గ్రూప్ వార్? ఇదే విచిత్రం అనుకోకండి నిజమే...
X

మనుషులు మాత్రమే యుద్ధాలు చేస్తారని మనం అనుకుంటాం. కానీ ఉగాండా అడవుల్లో చింపాంజిలు కూడా కొట్టుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కొట్లాటతో పదుల సంఖ్యలో చింపాంజీలు మృతి చెందుతున్నాయి. ఒకే చోట నివసించే చింపాంజిలు రెండు గ్రూపులుగా విడిపోవడం, సరిహద్దులు నిర్ణయించుకుని దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు. చింపాంజిల్లో ఈ వింత ప్రవర్తనపై ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. దీనిపై సాండేల్ అనే జంతు అధ్యయన శాస్త్రవేత్త సైన్స్ అనే జర్నల్ లో ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో కూడా ఉగాండ చింపాంజిల అంతర్యుద్ధంపై విస్తృత కథనాలు వస్తున్నాయి.

సాధారణంగా జంతువులు ఆహారం కోసం లేదా ఆధిపత్యం కోసం చిన్నపాటి ఘర్షణలకు దిగడం చూస్తుంటాం. కానీ, ఉగాండాలోని నేషనల్ పార్కుల్లో చింపాంజీలు చేస్తున్న యుద్ధాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇవి కేవలం ఆకలి కోసమో, రక్షణ కోసమో చేసే గొడవలుగా కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనుషుల మధ్య జరిగే 'గ్రూప్ వార్స్' మాదిరిగానే చింపాంజిలు సైతం ఒక వ్యూహాత్మక పద్ధతిలో దాడులు చేసుకోవడమే విస్మయానికి గురిచేస్తోంది.

మిత్రులే శత్రువులయ్యారు

ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్కులో నివసించే చింపాంజీల సమూహాన్ని 'న్గోగో' కమ్యూనిటీ అని పిలుస్తారు. దశాబ్దాల పాటు కలిసి ఉన్న ఈ అతిపెద్ద చింపాంజీల గుంపు, 2015లో ఈ గుంపు రెండుగా విడిపోయిందని చెబుతున్నారు. వీటికి వెస్ట్రన్ గ్రూప్, సెంట్రల్ గ్రూప్ అని పేర్లు పెట్టారు. దాదాపు 200 వరకు నేషనల్ పార్కులో చింపాంజిలు ఉండేవని కానీ ఏమైందో కానీ 2015 జూన్ 24న చింపాంజిల గుంపు విచిత్రంగా ప్రవర్తించాయని చెబుతున్నారు. ఒక గుంపు మరో గుంపు వద్దకు వచ్చి దాడి చేసిందని తాను గమనించినట్లు సాండేల్ చెబుతున్నారు.

ఇలా చిన్నగా మొదలైన దాడులు ఇప్పుడు బద్ధశత్రువులుగా మారి ప్రాణాలు తీసుకునేవరకు వచ్చిందని అంటున్నాడు. రెండేళ్లలోనే రెండు గ్రూపుల చింపాంజిలు వేర్వేరు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, తమ అడ్డాలోకి వేరే చింపాంజి రాకుండా సరిహద్దులు పెట్టుకుని గస్తీలు కాయడం చేస్తున్నాయని సాండేల్ వివరించారు. ఈ క్రమంలోన 2018లో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘటన జరిగి పలు చింపాంజిలు మరణించాయని చెబుతున్నారు.

అసలు కారణం ఏమిటి?

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ యుద్ధాలకు ప్రధాన కారణం ప్రాంతీయ ఆధిపత్యం అంటున్నారు. భూభాగాన్ని పెంచుకోవడం కోసం రెండు గ్రూపులు తగాదా పడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్ గ్రూప్ తన సరిహద్దులను పెంచుకోవడానికి వెస్ట్రన్ గ్రూప్ చింపాంజీలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా వ్యూహాత్మక దాడులకు దిగుతూ మగ చింపాంజీలు రాత్రిపూట సైలెంట్‌గా శత్రువుల భూభాగంలోకి వెళ్లి, ఒంటరిగా దొరికిన చింపాంజీలపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయని అంటున్నారు.

వనరుల వేట

చింపాంజిలలో ఈ వింత ప్రవర్తనకు పండ్లు, ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కూడా ఒక కారణం కావొచ్చని అంటున్నారు. 'సైన్స్ డైరెక్ట్, 'నేచర్' వంటి సైన్స్ జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం, చింపాంజీలు తమ గ్రూప్ సభ్యులతో పక్కాగా సమన్వయం చేసుకుంటున్నాయని, దాడుల సమయంలో నిశ్శబ్దాన్ని పాటించడం, శత్రువుల సంఖ్యను అంచనా వేయడం వంటివి చేస్తున్నాయని చెబుతున్నారు. కాగా, హార్వర్డ్ వంటి యూనివర్సిటీల శాస్త్రవేత్తలు 20 ఏళ్లకు పైగా ఈ న్గోగో చింపాంజీలను గమనించి, ఇవి మనుషుల్లాగే 'రాజకీయాలు' చేస్తున్నాయని నిర్ధారించడం గమనార్హం.