Begin typing your search above and press return to search.

ఏపీలో 'ఉగాది సెగ‌'.. ఏం జ‌రిగిందంటే!

ఏపీలో తాజాగా ఉగాది పుర‌స్కారాలు(హంస అవార్డులు) ప్ర‌క‌టించారు. దీంతోపాటు `క‌ళార‌త్న` అవార్డుల ను కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

By:  Garuda Media   |   18 March 2026 5:00 PM IST
ఏపీలో ఉగాది సెగ‌.. ఏం జ‌రిగిందంటే!
X

ఏపీలో తాజాగా ఉగాది పుర‌స్కారాలు(హంస అవార్డులు) ప్ర‌క‌టించారు. దీంతోపాటు `క‌ళార‌త్న` అవార్డుల ను కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దాదాపు 188 మందికి ఈ అవార్డులు ప్ర‌క‌టించారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వంలోనే వివాదంగా మారింది. ముఖ్యంగా రెండు విష‌యాలు ఈ వివాదానికి ఆజ్యం పోసిన‌ట్టు చెబుతున్నారు. దీంతో జాబితాను మార్చాలంటూ.. రాత్రికి రాత్రి ప్ర‌భుత్వంపై ఒత్తిడి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అయితే.. ఉగాదికి ఒక్క‌రోజు మాత్ర‌మే గ‌డువు ఉండ‌డంతో ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

వివాదం 1: ఏపీకి చెందిన క‌ళాకారులు, ఇత‌ర రంగాల్లోని ప్ర‌ముఖుల‌కు.. ఉగాది పుర‌స్కారాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి మూడు మాసాల కింద‌టే క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ఎమ్మెల్యేలు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌ముఖుల‌ను సిఫార‌సు చేశారు. అయితే.. తుది జాబితాలో వీరి పేర్లు క‌నిపించ‌లేదు. దీనిపై ఎమ్మెల్యేలు మండి ప‌డుతున్నారు. పైగా.. జాబితాను మంగ‌ళ‌వారం రాత్రి పొద్దు పోయాక ప్ర‌క‌టించ‌డం పైనా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

వివాదం 2: ఏపీకి చెందిన ఉగాది పుర‌స్కారాల్లో తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖుల పేర్లు సుమారు 25 పైనే ఉన్నాయి. వీరంతా ఆయా రంగాల్లో ల‌బ్ద‌ప్ర‌తిష్ఠులే అయిన‌ప్ప‌టికీ.. ఉగాది పుర‌స్కారం అనేది.. ఏ రాష్టానికి ఆ రాష్ట్రం ఇస్తున్నందున‌.. ఏపీకి చెందిన వారినే ఎంపిక చేయాల‌న్న‌ది స్థానికంగా కూట‌మి పార్టీల నుంచి వినిపిస్తున్న డిమాండ్‌. పైగా ఎంపిక క‌మిటీ కూడా ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌కుండానే.. ఈ అవార్డుల‌కు కొంద‌రిని ఎంపిక చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

సీఎంపై ఒత్తిడి: ఈ వ్య‌వ‌హారం.. సీఎం చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచింది. రాత్రికి రాత్రి ఇచ్చిన జాబితాను మార్చాలంటూ..ప‌దుల సంఖ్య‌లో సీఎంవో కార్యాల‌యానికి ఫోన్లు రావ‌డం.. ఈ జాబితాపై చాలా మంది అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో సీఎం చంద్ర‌బాబు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు. అయితే.. ఇప్పటికిప్పుడు జాబితాను మార్చేందుకు కూడా అవ‌కాశం లేదు. మ‌రో 24 గంటల్లోనే ఈ అవార్డుల‌ను అందించాల్సి ఉంది. దీంతో ప్ర‌స్తుతానికి వివాదం స‌ర్దుమ‌ణిగేలా.. ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గించేలా మంత్రులు వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం ఆదేశించిన‌ట్టు తెలిసింది.