Begin typing your search above and press return to search.

పండుగ పూట ఈ పగలేంది మోడీసాబ్?

యావత్ దేశంలో తిరుగులేని నేతగా.. ఆయన్ను ఎదుర్కొనే నేతలు ఎవరూ లేరన్నట్లుగా ఉంది ప్రధాని నరేంద్ర మోడీ తీరు

By:  Tupaki Desk   |   31 Dec 2023 4:57 AM GMT
పండుగ పూట ఈ పగలేంది మోడీసాబ్?
X

యావత్ దేశంలో తిరుగులేని నేతగా.. ఆయన్ను ఎదుర్కొనే నేతలు ఎవరూ లేరన్నట్లుగా ఉంది ప్రధాని నరేంద్ర మోడీ తీరు. ఆయన హవా ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి.. దాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ఆయన భారీ ఎత్తున కార్యక్రమాల్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లోనూ మోడీ తన ఇరుకు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారా? అంటే అవునని చెప్పాలి. మోడీ మహా మొండి మనిషి. ఒకసారి ఆయన మనసులో లెక్క తేడా కొడితే అదెప్పటికి కంటిన్యూ అవుతుంటుంది. క్షమించటం అన్నది ఆయనకు ఉండదా? అన్న భావన కలిగేలా ఆయన తీరు ఉంటుందని చెప్పాలి.

కారణం ఏమైనా.. ఆయన ఒకసారి టార్గెట్ చేయటం అన్నది షురూ చేస్తే.. అదెప్పటికి తగ్గదన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురికి ఆహ్వానాలు పంపుతున్నారు. అయోధ్యలో ఏ చిన్న కనెక్షన్ ఉన్నా.. వారిని గుర్తు పెట్టుకొని మరీ ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి వేళ.. శివసేన అధినేత కం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దశ్ ఠాక్రేకు మాత్రం అయోధ్య నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు.

ఆ మధ్యన అద్వానీ.. మురళీమనోహర్ జోషి లాంటి ప్రముఖులకు కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందకపోవటం.. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావటంతో.. నాలుక కర్చుకున్న అయోధ్య రామాలయ ట్రస్టు పెద్ద వయసు కదా? అంటూ ఏదో సర్ది చెప్పి.. వారికి ఆహ్వానపత్రాలు ఇచ్చి వచ్చారే తప్పించి.. వారు ఈ కార్యక్రమంలో హాజరయ్యే ఏర్పాట్లు మాత్రం చేయలేదు. పెద్ద వయసు కారణంగా వారు రాకపోవటమే మంచిదన్నట్లుగా వ్యాఖ్యానించటం తెలిసిందే.

రామజన్మభూమిలో రామాలయం అన్న నినాదంపై మొదట్నించి పోరాడిన అతి కొద్ది రాజకీయ పార్టీల్లో శివసేన ఒకటి. అలాంటి పార్టీ ముఖ్యనేతను రామాలయప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇదంతా చూస్తే మోడీతో ఉద్ధవ్ కు ఉన్న పొలిటికల్ పంచాయితీనే ఆహ్వానం అందకపోవటానికి కారణంగా చెబుతున్నారు. అయితే.. తనకు ఆహ్వానం అందనప్పటికి తాను అయోద్యకు వెళుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

రాముడు అందరి వాడని.. ఆయన్ను దర్శించుకోవటానికి ఆహ్వానంతో సంబంధం లేదన్న ఉద్దవ్.. ఎప్పుడు ఆలయాన్ని చూడాలనిపిస్తే అప్పుడు అయోధ్యకు వెళతానని చెప్పిన వైనం ఆసక్తికరంగా మారింది. రాముడితో రాజకీయం చేయొద్దన్న హితవు పలికి ఉద్దవ్.. 'రామమందిర ఉద్యమానికి శివసేన ఎంతో చేసింది. ఈ ప్రోగ్రాంను రాజకీయం చేయొద్దు. ఇది కోట్లాది మంది విశ్వాసాలకు సంబంధించిన అంశం. రాముడు ఒకపార్టీకి చెందినోడు కాదు'' అంటూ వ్యాఖ్యానించారు. ఉద్దవ్ మాటల్లో నిజం ఉంది. కానీ.. మోడీ లాంటి నేత మనసు ఉద్దవ్ కోరుకున్నంత విశాలంగా ఉండకపోవటమే తాజా పరిస్థితికి కారణంగా చెప్పాలి. రాజకీయంగా తనకు నచ్చని వారిని ప్రధాని మోడీ ఎంతలా దూరం పెడతారన్న దానికి తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.