Begin typing your search above and press return to search.

'నన్ను చంపేందుకు అంబులెన్సుతో రండి' మాజీ సీఎం తాజా మాట

ఇంత సీరియస్ గా మాట్లాడిన తర్వాత.. దాని కొనసాగింపుగా మరింత వాడీ వేడి పుట్టేలా వ్యాఖ్యలు చేస్తారని అనుకుంటారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 9:42 AM IST
నన్ను చంపేందుకు అంబులెన్సుతో రండి మాజీ సీఎం తాజా మాట
X

రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అన్నోళ్లు ఉండరు. అప్పటికప్పటి ప్రయోజనాలే మాత్రమే కీలకభూమిక పోషిస్తుంటాయి. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండి.. ఆ తర్వాతి కాలంలో సొంత కుంపటి పెట్టుకున్న పార్టీలు బోలెడు కనిపిస్తాయి. శివసేన ఉదంతంలోనూ ఇలాంటిదే కనిపిస్తుంది. మహారాష్ట్రలోని శివసేనలోని రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ కాస్తా.. రెండు ముక్కలు కావటం తెలిసిందే. ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా షిండే వర్గం చీలిపోయి శివసేన (షిండే) కొత్త కుంపటి పెట్టుకోవటం.. ఉద్దవ్ చేతిలోని అధికారాన్ని సొంతం చేసుకొని రాష్ట్రాన్ని కొంతకాలం ఏలటం తెలిసిందే.

సుదీర్ఘ కాల మిత్రుడిగా ఉన్న శివసేన.. తర్వాతి కాలంలో బీజేపీ అగ్రనాయకత్వంతో పడకపోవటం.. రాజకీయ అధికారాన్ని షేర్ చేసుకునే విషయంలో వచ్చిన అభిప్రాయభేదాలు .. చివరకు పార్టీ రెండు ముక్కలు అయ్యే వరకు వెళ్లింది. తాజాగా శివసేన 59వ వ్యవస్థాప దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసి.. తన రాజకీయ ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడ్డారు.

ఠాక్రే బ్రాండ్ ను ధ్వంసం చేసేందుకు బీజేపీతో పాటు ఏక్ నాథ్ షిండే కుట్రలు చేస్తున్నట్లుగా ఆరోపించిన ఉద్దవ్.. తన ప్రసంగంలో సినిమా డైలాగుల్ని ప్రస్తావిస్తూ .. సభికుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 1991లో విడుదలైన ప్రహార్ సినిమాలోని నానా పటేకర్ డైలాగ్ ను గుర్తు చేస్తూ.. రాజకీయ ప్రత్యర్థులకు సూటి సవాలు విసిరారు. దమ్ముంటే తనను రాజకీయంగా అంతం చేయాలని పేర్కొన్నారు.

ఇంత సీరియస్ గా మాట్లాడిన తర్వాత.. దాని కొనసాగింపుగా మరింత వాడీ వేడి పుట్టేలా వ్యాఖ్యలు చేస్తారని అనుకుంటారు. అందుకు భిన్నంగా ఆయన తన మాటల్ని మార్చేశారు. తనను చంపటానికి రావాలని..కాకుంటే వారు తమ వెంట అంబులెన్సును తెచ్చుకోవాలన్నారు. ఎందుకంటే ఆ అవసరం వారికే ఎక్కువ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మరాఠీ పార్టీల్లో విభేదాల్ని క్రియేట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న ఆయన..‘ఠాక్రే బ్రాండ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తే.. బీజేపీని ధ్వంసం చేస్తాం’ అంటూ హెచ్చరించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీనే సరిగా నడిపించలేక కిందా మీదా పడుతున్న ఉద్దవ్ తనకు స్థాయికి మించిన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఉద్దవ్ వ్యాఖ్యలపై శివసేన షిండే చీఫ్ స్పందించారు. ఉద్దవ్ ఠాక్రేను ప్రజలు ఎప్పుడో రాజకీయంగా అంతం చేశారంటూ ఎద్దేవా చేశారు. సింహం చర్మం కప్పుకుంటే సింహం కాలేరన్న ఆయన.. తోడేలు ఎప్పటికి సింహం కాలేరంటూ ఎద్దేవా చేశారు. ఉద్దవ్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందిస్తూ.. తనకు ఉత్తుత్తి మాటలు చెప్పే వారి గురించి మాట్లాడటం తనకు నచ్చదన్నారు. మొత్తానికి ఉద్దవ్ మాటల్ని సింఫుల్ గా తీసిపారేశారని చెప్పక తప్పదు.