కాకర్ల ఎఫెక్ట్ - మేకపాటికి చుక్కలు కనిపిస్తున్నాయ్...!
ఒక్కొక్క నాయకుడు వ్యవహరించే తీరు.. రాజకీయాల్లో కీలకంగా మారుతుంది. ఒక్కొక్క నేత వేసే అడుగులు రాజకీయ వ్యూహాన్ని కూడా మార్చేస్తాయి.
By: Garuda Media | 5 March 2026 4:00 AM ISTఒక్కొక్క నాయకుడు వ్యవహరించే తీరు.. రాజకీయాల్లో కీలకంగా మారుతుంది. ఒక్కొక్క నేత వేసే అడుగులు రాజకీయ వ్యూహాన్ని కూడా మార్చేస్తాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. రెండు మూడు దశాబ్దాలుగా ఇక్కడ తిష్ట వేసుకుని రాజకీయాలు చేసిన.. నాయకుడు తెర మరుగు అయ్యారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. సదరు నేత అలజడి కూడా ఎక్కడా వినిపించడం లేదు. దీనికి కారణం.. కొత్త నేత చూపిస్తున్న దూకుడే!.
ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డికి బలమైన పట్టుంది. గత కొన్ని ఎన్నికల్లో ఆయన విజయం దక్కించుకున్నారు. 2019లో ఆయన వైసీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు. కానీ, మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతోపాటు.. అంతర్గత కుమ్ములాటల్లో ఆయన పైచేయిసాధించకపోవడంతోపాటు.. గత ఎన్నికల్లో టికెట్‌లేని పరిస్థితి తెచ్చుకున్నారు. అదేసమయంలో వైసీపీలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టు కుని బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే మేకపాటి టీడీపీ చెంతకు చేరిపోయారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా.. ఆయనకు దక్క లేదు. యువ నాయకుడు కాకర్ల సురేష్‌కు చంద్రబాబు పగ్గాలు అప్పగించారు. ఆయన ఘన విజయం దక్కించుకున్నారు. అయితే.. ఎమ్మెల్యే ఎవరైనా తన ఆధిపత్యమే నెగ్గాలన్న మేకపాటికి ఆ వ్యూహం ఫలించలేదు. ఆయన మద్దతుదారులు కూడా మేకపాటి వైఖరికి విసిగిపోయారు. దీంతో ఇప్పుడు మేకపాటికి సొంత బలం కూడా తగ్గిపోయింది.
మరోవైపు కాకర్ల సురేష్.. ఎమ్మెల్యేగానే కాకుండా.. స్థానికంగా యువతకు కూడా చేరువయ్యారు. తనదైన శైలిలో అందరినీ కలుపుకొని పోతున్నారు. ముఖ్యంగా మేకపాటి హయాం నుంచి ఉన్న సమస్యలను ఆయన పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రహదారుల నుంచి తాగునీటి వరకు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో సురేష్ మాటే వినిపిస్తోంది. ఒకప్పుడు మేకపాటికి జైకొట్టిన రెడ్డి సామాజిక వర్గం కూడా.. కాకర్లకు అనుకూలంగా మారడంతో చంద్రశేఖరరెడ్డికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన మరోసారి మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
