సీబీఐటీ విద్యార్థి టూ గ్లోబల్ ఏఐ లీడర్: ఓపెన్‌ఏఐ కీలక బాధ్యతల్లో మన తెలుగు తేజం..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్న దిగ్గజ సంస్థ 'ఓపెన్‌ఏఐ'లో తెలుగు యువకుడు ఉదయ్ రుద్దర్రాజు అత్యున్నత పదవిని అధిరోహించారు.
By: A.N.Kumar | 20 July 2026 12:22 PM ISTప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్న దిగ్గజ సంస్థ 'ఓపెన్‌ఏఐ'లో తెలుగు యువకుడు ఉదయ్ రుద్దర్రాజు అత్యున్నత పదవిని అధిరోహించారు. చాట్‌జీపీటీ మాతృసంస్థ అయిన ఓపెన్‌ఏఐలో ఆయన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) కంప్యూట్ విభాగంగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఒక సాధారణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఏఐ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగిన ఉదయ్ ప్రయాణం.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే అద్భుత విజయగాథ.
సీబీఐటీ నుంచి కెరీర్ ప్రారంభం
ఉదయ్ రుద్దర్రాజు హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏ.డబ్ల్యూఎస్)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కించుకుని క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అప్పట్లోనే పట్టు సాధించారు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు
మాస్టర్స్ పూర్తయిన తర్వాత ఉదయ్ రుద్దర్రాజు టెక్నాలజీ రంగంలో శరవేగంగా దూసుకుపోయారు. 2012 నుంచి 2018 వరకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈబేలో పనిచేశారు. అక్కడ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధునికీకరణ, కుబెర్నెటిస్ అమలు.. భారీ స్థాయి ఇంజినీరింగ్ వ్యవస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఆ తర్వాత ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ రాబిన్‌హుడ్ లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగానికి నాయకత్వం వహించారు. రాబిన్‌హుడ్ వినియోగదారుల సంఖ్య 10 లక్షల నుంచి ఏకంగా 2.4 కోట్లకు పెరిగిన అత్యంత కీలక సమయంలో సంస్థ సాంకేతిక వ్యవస్థలు కుప్పకూలకుండా అత్యంత విశ్వసనీయమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడంలో ఉదయ్ కృషి మరువలేనిది.
ఎక్స్‌ఏఐ నుంచి ఓపెన్‌ఏఐ సీటీఓ వరకు..
ఉదయ్ ప్రతిభను గుర్తించిన ఎలాన్ మస్క్ 2024లో తన ఏఐ స్టార్టప్ ఎక్స్‌ఏఐ లో హెడ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్గా నియమించారు. అక్కడ కంప్యూటింగ్, నెట్‌వర్కింగ్, స్టోరేజ్, డేటా సెంటర్లు, రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అత్యంత కీలక విభాగాలను ఆయన విజయవంతంగా నడిపించారు. అనంతరం 2025లో ఓపెన్‌ఏఐలో హెడ్ ఆఫ్ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్గా చేరిన ఆయన.. అతి తక్కువ కాలంలోనే తన అసాధారణ నైపుణ్యంతో ఇప్పుడు సీటీఓ (కంప్యూట్) స్థాయికి పదోన్నతి పొందారు. ‘‘జీపీటీ 5.6 మోడళ్లకు అవసరమైన మెషీన్ లెర్నింగ్ వ్యవస్థలను నిర్మిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూట్ ఫుట్‌ప్రింట్‌ను నిర్మించడమే మా లక్ష్యం." అని తాజాగా లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఉదయ్ రుద్దర్రాజు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న చాట్‌జీపీటీ వెనుక ఉన్న సాంకేతిక మౌలిక వసతులను, సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అత్యంత గురుతర బాధ్యత ఇప్పుడు ఉదయ్ రుద్దర్రాజు భుజాలపై ఉంది.
హైదరాబాద్‌లో సాధారణ విద్యార్థిగా ప్రయాణాన్ని ప్రారంభించి.. నేడు గ్లోబల్ ఏఐ రంగాన్ని శాసించే స్థాయికి చేరిన ఉదయ్ రుద్దర్రాజు విజయం తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న యువ ఇంజినీర్లకు ఒక గొప్ప నిదర్శనం. ప్రతిభ, నిరంతర కృషి, పట్టుదల ఉంటే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన మరోసారి నిరూపించారు.
