దేశీయ రియల్ ఎస్టేట్ లో రికార్డు.. చదరపు అడగు రూ.2.75 లక్షలు
అత్యంత విలాసవంతమైన ప్రాజెక్టులో చదరపు అడుగు ఎంత ఉంటుంది? రూ.15 వేలా? రూ.20వేలా..? మహా అయితే రూ.25 వేలకు మించి చెప్పటానికి ఎవరైనా సంకోచిస్తారు. కానీ..
By: Tupaki Desk | 7 May 2025 10:30 AMఅత్యంత విలాసవంతమైన ప్రాజెక్టులో చదరపు అడుగు ఎంత ఉంటుంది? రూ.15 వేలా? రూ.20వేలా..? మహా అయితే రూ.25 వేలకు మించి చెప్పటానికి ఎవరైనా సంకోచిస్తారు. కానీ.. బిలియనీర్ ఉదయ్ కోటక్ మాత్రం కలలో కూడా ఊహించలేని ధర చెల్లించి రికార్డు క్రియేట్ చేశారు. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటివరకు నమోదు కాని ఒక కొత్త రేటును ఫిక్స్ చేశారు. ముంబయిలోని ఒక భవనంలో చదరపు అడుగుకు రూ.2.75 లక్షల చొప్పున కొనుగోలు చేయటం ద్వారా దేశీయ రియల్ ఎస్టేట్ లో సరికొత్త రికార్డును నమోదు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఇంతకూ జరిగిందేమంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని వర్లి సీ ఫేస్ లో ఒక నివాస భవనం ఉంది. అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ పాత భవనంలో మొత్తం 24 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్లలో కనిష్ఠంగా 444 చదరపు అడుగుల నుంచి గరిస్ఠంగా 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటిల్లో ఇప్పటివరకు 13 ప్లాట్లను రిజిస్టర్ చేసుకోగా.. తాజాగా మరో 8 ప్లాట్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందుకోసం రూ.131.55 కోట్లు ఖర్చు చేయటం విశేషం. మరో మూడు ప్లాట్లకు ఎంత చెల్లించారన్నది మాత్రం బయటకు రాలేదు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ ఈ ఆస్తుల్ని కొనుగోలు చేశారు. నిజానికి ఈ భవనంలోని అన్ని ప్లాట్లను కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా.. అది సాధ్యం కావటం లేదు. తాజాగా భారీ ధరకు పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు పోగా.. మిగిలిన మూడు ప్లాట్లను సొంతం చేసుకుంటే.. ఈ భవనం మొత్తం కొటక్ బ్యాంక్ అధినేత సొంతమవుతుంది. ఇప్పటికే ఉన్న పాత భవనాన్ని తొలగించి..సరికొత్త భవనాన్ని నిర్మిస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.