Begin typing your search above and press return to search.

రానున్న రోజులు మరింత కఠినం.. ప్రముఖ బ్యాంకర్ ఆందోళనకర వ్యాఖ్యలు.. దేశంలో ఏం జరుగుతోంది..!

‘రాబోయే రోజులు మరింత కఠినంగా ఉండబోతున్నాయి’ అని హింట్ ఇస్తే, నిన్న బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్ కూడా అదే మాట చెప్పారు.

By:  Tupaki Political Desk   |   13 May 2026 11:43 AM IST
రానున్న రోజులు మరింత కఠినం.. ప్రముఖ బ్యాంకర్ ఆందోళనకర వ్యాఖ్యలు.. దేశంలో ఏం జరుగుతోంది..!
X

‘రాబోయే రోజులు మరింత కఠినంగా ఉండబోతున్నాయి’ అని హింట్ ఇస్తే, నిన్న బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్ కూడా అదే మాట చెప్పారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక. భౌగోళిక రాజకీయ పరిస్థితులను గమనిస్తుంటే, మున్ముందు రోజులు మరింత సవాలుతో కూడుకున్నవిగా మారబోతున్నాయనేది అక్షరాలా నిజం. ప్రధాని మోదీ పదే పదే చేస్తున్న హెచ్చరికలకు తోడు, ఇప్పుడు ఉదయ్ కోటక్ వంటి ఆర్థిక దిగ్గజాలు కూడా అదే బాటలో గొంతు కలపడం సామాన్యుడిని ఆలోచింపజేస్తోంది. దశాబ్ద కాలంగా ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి.

చైనా ముందస్తు చూపు!

మనం ఇంకా ‘పెట్రోల్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయా?’ అని బంకుల దగ్గర ఎదురుచూస్తుంటే, చైనా లాంటి దేశాలు మాత్రం ఎప్పుడో లాజిక్ కనిపెట్టేశాయి. భవిష్యత్తులో చమురు యుద్ధాలు వస్తాయని ఊహించే, వారు కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వడివడిగా వేశారు. ‘పెట్రోల్ లేదు.. గ్యాస్ లేదు.. అంతా బ్యాటరీ మయం’ అనే దిశగా వారు వెళ్లడం వెనుక ఉన్నది కేవలం పర్యావరణ ప్రేమ కాదు, అది పక్కాగా ఒక 'సర్వైవల్ వ్యూహం'. దీనిని పట్టించుకోని మనం ఇప్పుడు ఆ చమురు సంక్షోభం రావడంతో ప్రభుత్వంపై గొంతెత్తుతున్నాయం.

భారత్ కు సమయం సరిపోలేదా..

చైనా దూసుకుపోతుంటే, ‘భారత్ కు ఆ సమయం సరిపోలేదా?’ అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. నిజానికి సమయం కంటే కూడా, మనకున్న 'రిలాక్స్' మనస్తత్వమే మనల్ని వెనక్కి నెట్టిందేమో అనిపిస్తోంది. ఎలక్ట్రిక్ వైపు మళ్లడం అనేది ఒక రాత్రిలో జరిగే పని కాదు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీపై మనం ఇంకా ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నాం. పక్కవాడు రాకెట్ వేగంతో వెళ్తుంటే, మనం ఇంకా రోడ్లపై గుంతలు పూడ్చుకుంటూ కూర్చున్నాం. ఆ సమయం సరిపోలేదనే సాకు కంటే, ఆ వేగం అందుకోలేదనే నిజాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది.

‘నా కోసం’ నుంచి ‘దేశం కోసం’..గా మారాలి..

ఇంతకాలం ‘నా ఎంజాయ్‌మెంట్.. నా లైఫ్’ అని బతికేసిన మనకు, ఇప్పుడు దేశం కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మనం వాడే ప్రతి లీటర్ చమురు, మనం చేసే ప్రతి అనవసర ఖర్చు విదేశీ మారక ద్రవ్యాన్ని హరిస్తోంది. ఉదయ్ కోటక్ లాంటి వారు చెప్పేది ఒకటే.. ‘నువ్వు దేశ భక్తుడివి అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కాదు, నీ ఖర్చు తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోయడం ముఖ్యం.’ అంటే, మన స్వార్థం కంటే దేశ భవిష్యత్తు ముఖ్యం అనే పాయింట్ దగ్గర ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆగాల్సిందే.

పొదుపే పరమావధి!

‘సంపాదించడం ముఖ్యం కాదు, ఎంత దాచావు అన్నదే ముఖ్యం’ అనే పాతకాలపు సామెత మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. రాబోయే పదేళ్లలో ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం మారబోతోంది. చమురు యుద్ధాలు, ఆహార సంక్షోభాలు ముంచుకొస్తున్న తరుణంలో, మన దగ్గర ఉన్న నగదు నిల్వలే మనల్ని కాపాడతాయి. ఇప్పుడు కొత్త మోడల్ ఐఫోన్ కొనడం కంటే, ఆ డబ్బును పొదుపు చేయడం వల్ల దేశానికి, మనకు కూడా క్షేమకరం. ఖర్చు చేసేటప్పుడు ఉన్న ఉత్సాహం, దాచేటప్పుడు కూడా ఉంటేనే.. మున్ముందు రాబోయే 'తీవ్రమైన' రోజులను మనం తట్టుకోగలం.