Begin typing your search above and press return to search.

నీటి సరఫరా ఆగిపోతుందా? UAEలో బాటిల్ వాటర్ కోసం పోటీ… ప్రభుత్వం క్లారిటీ

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొత్త టెన్షన్ పుట్టించాయి.

By:  Madhu Reddy   |   3 March 2026 8:00 PM IST
నీటి సరఫరా ఆగిపోతుందా? UAEలో బాటిల్ వాటర్ కోసం పోటీ… ప్రభుత్వం క్లారిటీ
X

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొత్త టెన్షన్ పుట్టించాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో రానున్న రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోతుందనే భయంతో దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో జనం సూపర్ మార్కెట్లకు పోటెత్తారు. బాటిల్ వాటర్ కోసం జనం ఎగబడటంతో అక్కడ మార్కెట్లో అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఈ 'ప్యానిక్ బయ్యింగ్' సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అసలు నిజంగానే నీటి కొరత ఉందా? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బాటిల్ వాటర్ కోసం క్యూలు.. ఖాళీ అవుతున్న మార్కెట్ :

ఇక అక్కడ యుద్ధం ఎప్పుడు ఎటు దారితీస్తుందో అన్న ఆందోళనతో యూఏఈలోని ప్రవాసులు, స్థానికులు ముందస్తు జాగ్రత్తగా నిత్యావసరాలను నిల్వ చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా బాటిల్ వాటర్ కొనుగోలు చేయడానికి జనం సూపర్ మార్కెట్ల ముందు బారులు తీరారు. హార్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణా నిలిచిపోతే, బయటి దేశాల నుండి వచ్చే వస్తువుల సరఫరా ఆగిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక దీంతో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో వాటర్ బాటిల్ కేస్‌లను కొనుగోలు చేస్తుండటంతో గంటల వ్యవధిలోనే స్టాక్ మొత్తం నిండుకుంటోంది. చాలా చోట్ల "నో స్టాక్" బోర్డులు కనిపిస్తుండటం ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతోంది.

సరఫరా నిలిచిపోతుందా?:

యూఏఈకి వచ్చే సరుకుల్లో అత్యధిక శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తాయి. ఇరాన్ ఒకవేళ ఈ మార్గాన్ని మూసివేస్తే, ఆహార పదార్థాలు మరియు నీటి శుద్ధికి అవసరమైన పరికరాల రవాణాకు ఆటంకం ఏర్పడుతుందని జనం భయపడుతున్నారు. ఇక యుద్ధం తీవ్రత పెరిగితే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయని, అసలు వస్తువులే దొరకని పరిస్థితి వస్తుందని వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న పుకార్లు ఈ గందరగోళానికి ప్రధాన కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా జనం ఇలా భయాందోళనతో వస్తువులను కొనుగోలు చేయడం అధికారులకు కొత్త సవాలుగా మారింది.

ఎవరూ కంగారు పడొద్దు.. ప్రభుత్వం గట్టి భరోసా:

ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను గమనించిన యూఏఈ ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. దేశంలో నీటి కొరత ఏర్పడే అవకాశమే లేదని, తగినన్ని నిల్వలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. కనీసం మూడు నెలల పాటు దేశం మొత్తానికి సరిపడా నీటి నిల్వలు మరియు ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక ప్రజలు అనవసరంగా భయపడి నిత్యావసరాలను నిల్వ చేసుకోవద్దని, సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొంది. ఇక అలాగే, ఇలాంటి లేనిపోని సమస్యలు సృష్టించే వారిపై, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.