Begin typing your search above and press return to search.

భారత్ కు అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పిన దుబాయ్!

ఈ సమయంలో తమ కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష మంజూరు చేశారు.

By:  Tupaki Desk   |   28 March 2025 11:49 AM IST
UAE President Pardon To Indians
X

తెలిసో తెలియకో తప్పులు చేసి విదేశాల్లో మగ్గుతున్న భారతీయులు పలు దేశాల్లోని జైళ్లలో ఉన్నారనే సంగతి తెలిసిందే! ప్రధనంగా బతుకుదెరువు కోసం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లినవారు, పొరపాటున పాక్ జలాల్లోకి వెళ్లిన మత్స్యకారులు ఆయ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారు. ఈ సమయంలో తమ కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష మంజూరు చేశారు.

అవును... రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్.. అక్కడి కారాగారాల్లో ఉన్న ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు. ఇందులో భాగంగా.. 1518 మందికి క్షమాభిక్ష ప్రసాదించడంతో పాటు 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇలా విడుదలైన 1295 మంది ఖైదీల్లో 500 మందికి పైగా భారతీయులు ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని దుబాయ్ అటార్నీ జనరల్ వెల్లడించారు. దీంతో... విడుదలవుతున్న వారి కుటుంబాలు సంబరాలు చేసుకుంటున్నాయని అంటున్నారు. మరోవైపు.. ఈ చర్య భారత్ - యూఏఈ మధ్య బలమైన సంబంధాలను తెలియజేస్తోందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన దుబాయ్ అటార్నీ జనరల్ ఛాన్సల్ ఇస్సా అల్ హుమైదాన్... దుబాయ్ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్ మంజూరుచేసిన క్షమాభిక్ష వర్తిస్తుందని.. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, స్థానిక పోలీసుల సమన్వయంతో వారి విడుదలకు చట్టపరమైన విధానాలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు.

కాగా... ప్రతీ రంజాన్ మాసం సందర్భంగా జైళ్లలోని ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ క్షమాభిక్ష కచ్చితంగా వారి వారి సత్ప్రవర్తన ఆధారంగానే ఉంటుంది. ఇదే సమయంలో.. వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే కొంత ఆర్థిక సాయం కూడా అందించనున్నారని అంటున్నారు.

మరోపక్క యూఏఈలో మరణశిక్షలు పడిన భారతీయులు 25 మంది ఉన్నారని.. వారిపై కోర్టు తీర్పులు ఇంకా అమలుకాలేదని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఇటీవల రాజ్యసభలో తెలిపారు. ఈ క్రమంలో.. విదేశీ జైళ్లలో ఉన్నవారు, విచారణలు ఎదుక్రొంటున్నవారు మొత్తం 10,152 మంది ఉన్నారని వెల్లడించారు.