అమెరికాకు యూఏఈ 'షాక్' ట్రీట్మెంట్? గల్ఫ్ దేశాలూ.. కాస్త కళ్ళు తెరవండి బాస్!
అగ్రరాజ్యం అమెరికాకు ఈ మధ్య కాలం అస్సలు కలిసి వస్తున్నట్టు లేదు. ప్రపంచానికి తానే 'పెద్దన్న' అని ఫీలయ్యే వాషింగ్టన్‌కు ఇప్పుడు సొంత మిత్రదేశాలే షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.
By: A.N.Kumar | 13 Jun 2026 1:47 PM ISTఅగ్రరాజ్యం అమెరికాకు ఈ మధ్య కాలం అస్సలు కలిసి వస్తున్నట్టు లేదు. ప్రపంచానికి తానే 'పెద్దన్న' అని ఫీలయ్యే వాషింగ్టన్‌కు ఇప్పుడు సొంత మిత్రదేశాలే షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. తాజాగా మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు గట్టి దెబ్బ తగిలిందనే టాక్ నడుస్తోంది. ఇరాన్‌ను ఒంటరిని చేయాలని అమెరికా వేసిన ప్లాన్లకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గట్టిగానే చెక్ పెట్టినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కథేంటి? ఆ 10 బిలియన్ డాలర్ల గుసగుసలు ఏంటి?
అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు.. ఇరాన్ మరోవైపు.. గత కొన్ని నెలలుగా గల్ఫ్ ప్రాంతంలో ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్లతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ గొడవల్లో యూఏఈ బ్యాంకింగ్, లాజిస్టిక్స్ రంగాలు కూడా కాస్త దెబ్బతిన్నాయి. అయితే "దెబ్బకు దెబ్బ" కాకుండా, "దౌత్యానికి దౌత్యం" అన్నట్లు యూఏఈ రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌కు చెందిన దాదాపు 10 బిలియన్ డాలర్ల ఫ్రీజ్ చేసిన నిధులను దశలవారీగా విడుదల చేయడానికి యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అందులో ఇప్పటికే 3 బిలియన్ డాలర్లు ఇరాన్ జేబులోకి చేరిపోయాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్త వినడమే ఆలస్యం అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఎందుకంటే తను ఆంక్షలు విధించి ఇరాన్‌ను ఆర్థికంగా నొక్కేయాలని చూస్తుంటే పక్కనే ఉన్న మిత్రదేశం ఇలా నిధులు ఇస్తే అమెరికాకు కుయ్యో మొర్రో అనక తప్పదు కదా..
యూఏఈ ట్విస్ట్.. "మేము చేయలేదు బాబోయ్!"
ఈ వార్తలు కాస్త గట్టిగా ప్రచారం కావడంతో యూఏఈ విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. "ఆ వార్తల్లో అస్సలు నిజం లేదు. మేము ఎలాంటి నిధులను బదిలీ చేయలేదు. ఆ ప్రక్రియను సులభతరం చేయలేదు" అంటూ అధికారికంగా ఖండించింది. ఇదంతా మీడియా సృష్టి అని, అధికారిక వనరులను మాత్రమే నమ్మాలని కోరింది.
ఖండనలైతే వచ్చాయి కానీ అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం "నిప్పు లేనిదే పొగ రాదు" అని నవ్వుకుంటున్నారు. గతంలో కూడా ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను చాటుగానో అండగానో కొనసాగించిన ట్రాక్ రికార్డ్ యూఏఈకి ఉంది.
గల్ఫ్ దేశాలూ మేలుకోండి.. అమెరికాకు ఇది కావాల్సిందే..
అమెరికా ఎప్పుడూ తన స్వార్థం చూసుకుంటుంది తప్ప గల్ఫ్ దేశాల భద్రతను పూర్తిగా పట్టించుకోదనే నమ్మకం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాల్లో బలపడుతోంది. అందుకే యూఏఈ ఇప్పుడు బహుముఖ విదేశాంగ విధానాన్ని ఎంచుకుంది.
ఒకవైపు అమెరికాతో దోస్తీ కంటిన్యూ చేస్తూనే.. మరోవైపు చైనా, ఇరాన్ వంటి దేశాలతో 'చర్చల' తలుపులు తెరిచే ఉంచుతోంది. మిగతా గల్ఫ్ దేశాలు కూడా మేలుకోవాల్సిన సమయం ఇది. అమెరికా ఎప్పుడు ఎవరిని ముంచుతుందో తెలియని పరిస్థితి. అందుకే తమ సొంత భద్రత, ఆర్థిక ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరం.
పెద్దన్నకు ఇకనైనా బుద్ధి వస్తుందా?
అమెరికాకు ఇది నిజంగానే ఒక హెచ్చరిక. తమ మాట వింటూ పడి ఉండడానికి గల్ఫ్ దేశాలు ఇప్పుడు సిద్ధంగా లేవు. ప్రాంతీయ శాంతి, సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా అవి అడుగులు వేస్తున్నాయి. యూఏఈ నిధుల విడుదల వార్తను ఖండించినప్పటికీ అమెరికా గుత్తాధిపత్యానికి గల్ఫ్ రీజియన్‌లో కాలం చెల్లుతోందనే దానికి ఈ పరిణామాలు ఒక స్పష్టమైన సంకేతం. అమెరికాకు ఈ శాస్తి జరగాల్సిందే మరి!
