Begin typing your search above and press return to search.

షెడ్యూల్ కంటే 2 రోజుల ముందే ఆ 2 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు

దేశ వ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలకు.. నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 March 2024 1:36 PM GMT
షెడ్యూల్ కంటే 2 రోజుల ముందే ఆ 2 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు
X

దేశ వ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలకు.. నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా సీఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ షెడ్యూల్ కు సంబంధించిన కీలకమైన మార్పు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. షెడ్యూల్ లో పేర్కొన్న దాని ప్రకారం లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు.. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టాల్సి ఉంది.

అయితే.. అందుకు భిన్నంగా రెండు రోజులు ముందే అరుణాచల్ ప్రదేశ్.. సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. ఎందుకిలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు. ఈ రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీల గడువు జూన్ 2 నాటికే తీరిపోనుంది. ఒకవేళ.. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. అందుకే దాన్ని నివరించేందుకు వీలుగా.. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని రెండు రోజుల ముందే పూర్తి చేసేలా తమ ప్రకటనను వెల్లడించారు.

అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో నిర్వహించే పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపును మాత్రం యథావిధిగా జూన్ 4నే చేపడతారు. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ మొత్తం స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. సిక్కిం విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనూ ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ మొన్ననే వెలువడింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే కూటమి పాలన సాగుతోంది. ఈసారి ఫలితాలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.