Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్రకు దూరంగా ఆ ఇద్దరు ఎంపీలు.. అసలేం జరుగుతోంది?

లోకేష్ పాదయాత్ర వైపు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని కన్నెత్తి చూడడం లేదని తెలిసింది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 10:01 AM GMT
లోకేష్ పాదయాత్రకు దూరంగా ఆ ఇద్దరు ఎంపీలు.. అసలేం జరుగుతోంది?
X

యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోరుమీదున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తూ ప్రజల్లో పార్టీకి తిరిగి ఆదరణ పెంచేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పుడు ఆయన యాత్ర ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సాగుతోంది. ఇక్కడ టీడీపీకి మంచి పట్టుందని టాక్. కానీ సొంత పార్టీలోని ఇద్దరు కీలక నేతలు.. లోకేష్ యాత్రకు దూరంగా ఉంటుండం చర్చనీయాంశంగా మారింది. లోకేష్ పాదయాత్ర వైపు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని కన్నెత్తి చూడడం లేదని తెలిసింది.

టీడీపీలోని ఇద్దరు ఎంపీలు లోకేష్ పాదయాత్రను పట్టించుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన గల్లా జయదేవ్, కేశినేని నాని పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను లైట్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఇద్దరు ఎంపీల తీరు పట్ల బాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో పర్యటిస్తూ టీడీపీ విజయం కోసం బాబు పోరాడుతున్నారు. మరోవైపు సొంత జిల్లాలో యువగళం పాదయాత్ర సాగుతున్నా ఈ ఇద్దరు ఎంపీలు పట్టించుకోకపోవడం బాబుకు కోపాన్ని తెప్పించిందని సమాచారం.

ఈ ఇద్దరు ఎంపీలు లోకేష్ పాదయాత్రలో పాల్గొనకపోవడంతో టీడీపీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయని టాక్. కేశినేని నాని ఇప్పటికే టీడీపీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీపై చాలా సార్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా విజయవాడలో తన తమ్ముడు కేశినేని చిన్నిని పార్టీ ప్రోత్సహించడం నానికి నచ్చలేదని తెలిసింది. లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లను చిన్ని దగ్గరుండి మరీ చూసుకుంటుండడం గమనార్హం. మరోవైపు గల్లా జయదేవ్ అందుబాటులో లేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.