Begin typing your search above and press return to search.

మహిళా బిల్లును వ్యతిరేకించింది ఈ ఇద్దరే... కారణం ఇదే?

ఈ సందర్హంగా ఈ చారిత్రక బిల్లుకు 454 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా.. ఇద్దరు ఎంపీలు మాత్రం వ్యతిరేకించారు. దీంతో ఆ ఇద్దరు ఎంపీలు ఎవరనే చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 3:29 PM GMT
మహిళా బిల్లును వ్యతిరేకించింది ఈ ఇద్దరే... కారణం ఇదే?
X

మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌ సభలో ఆమోదం పొందింది. దీంతో.. నూతన పార్లమెంటులో ఆమోదం పొందిన తొలి బిల్లుగా ఇది రికార్డ్ సృష్టించింది. ఇక తర్వాత రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. "నారీ శక్తి వందన్‌ అధినియం" పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ సెప్టెంబర్‌ 19న ప్రవేశపెట్టగా.. సెప్టెంబర్‌ 20న దీనిపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సుమారు ఎనిమిది గంటలపాటు జరిగిన చర్చ అనంతరం.. న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్హంగా ఈ చారిత్రక బిల్లుకు 454 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా.. ఇద్దరు ఎంపీలు మాత్రం వ్యతిరేకించారు. దీంతో ఆ ఇద్దరు ఎంపీలు ఎవరనే చర్చ మొదలైంది.

అవును... చారిత్రక మహిళా బిల్లుకు లోక్ సభలో ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. వీరిద్దరూ ఎంఐఎం ఎంపీలు కావడం గమనార్హం. వీరిలో ఒకరు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాగా... మరొకరు ఔరంగాబాద్ కు చెందిన ఎంపీ ఇంతియాజ్ జలీల్. వీరిద్దరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

అయితే మహిళా రిజర్వేషన్ లలో ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా లేకపోవడంతో వీరు ఈ బిల్లును వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

ఆ సంగతి అలా ఉంటే... ఈ బిల్లును అనంతరం పెద్దల సభకు పంపుతారు. అక్కడ ఆమోదం పొందినా కూడా... రిజర్వేషన్‌ కోటా అమలయ్యేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనే అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల తర్వాత జనగణన, డీలిమిటేషన్ చేపడతామని పేర్కొన్నారు.

ఇక ఈ బిల్లుపై మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా... ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్‌ జరిగే ప్రక్రియను వారికి వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే "ఎస్‌" అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై "నో" అని రాయాలని చెప్పారు. ఈ సమయంలో ఇద్దరు ఎంపీలు రెడ్ స్లిప్ పై "నో" అని రాశారు!