Begin typing your search above and press return to search.

ఎయిర్‌ పోర్టులో హార్ట్ టచింగ్ సీన్... కేటీఆర్ హ్యాపీ!

వివరాళ్లోకి వెళ్తే... 2005లో సిరిసిల్ల జిల్లాకు చెందిన రవి, మల్లేశం, హన్మంతు, వెంకటేశ్, లక్ష్మణ్ అనే ఐదుగురు బ్రతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 11:20 AM GMT
ఎయిర్‌  పోర్టులో హార్ట్  టచింగ్  సీన్... కేటీఆర్  హ్యాపీ!
X

ఉపాధి కోసం దుబాయ్ దేశానికి వెళ్లి.. అనుకోని పరిస్థితుల్లో అక్కడ ఒక హత్య కేసులో ఇరుక్కుని.. సుమారు 18 ఏళ్ల పాటు అక్కడ జైలు శిక్ష అనుభవించిన ఐదుగురు వ్యక్తులకు అక్కడి కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. దీంతో ఎట్టకేలకు ఆ వలస కార్మికులు ఒక్కొక్కరుగా సొంత ఊరికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తున్న దృశ్యం హృదయాన్ని మెలిపెట్టేలా ఉందనే చెప్పాలి.

అవును... సుదీర్ఘ కాలం దుబాయ్‌ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులు సుమారు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో... ఇక అక్కడే తమ జీవితం ముగిసిపోతుందని భావించిన వారు సొంత వారిని కళ్లారా చూడటంతో కన్నీళ్లు ఆపుకోలేకపోతుండగా.. వారిని చూసిన కుటుంబ సభ్యుల కళ్లు ఆనంద భాష్పాలతో నిండి పొంగుతున్నాయి.

మాజీ మంత్రి, బీఆరెస్స్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చొరవతో వీరంతా జైలు నుంచి విడుదలైన స్వదేశానికి చేరుకుంటున్నారు. దీంతో ఈ విషయంపై "బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పట్టువదలని కృషితో... 18 ఏండ్ల జైలు జీవితం అనంతరం దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు" అంటూ బీఆరెస్స్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేయగా... దీనిపై స్పందించిన కేటీఆర్... చాలా ఆనందంగా ఉందని తెలిపారు!

వివరాళ్లోకి వెళ్తే... 2005లో సిరిసిల్ల జిల్లాకు చెందిన రవి, మల్లేశం, హన్మంతు, వెంకటేశ్, లక్ష్మణ్ అనే ఐదుగురు బ్రతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లారు. అలా వారు దుబాయ్ వెళ్లిన ఆరు నెలలకే అక్కడ వాచ్ మెన్ గా పనిచేస్తున్న బహదూర్ సింగ్ అనే నేపాలీ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సమయంలో అక్కడే పని చేస్తున్న ఈ ఐదుగురు హత్య కేసులో ఇరుక్కున్నారు.

ఈ సమయంలో అక్కడ స్థానిక భాష సరిగా రాకపోవడంతోనో ఏమో పోలీసులకు ఏం చెప్తున్నారో తెలియక పోవడంతో శిక్ష పడింది. ఇందులో భాగంగా దుబాయ్ కోర్టు వీరికి మొదట పదేళ్లు జైలు శిక్ష విధించగా.. అనంతరం అప్పీలుకు వెళ్లగా పాతికేళ్లు శిక్ష విధించింది. అయితే దుబాయ్ లోని చట్టాల ప్రకారం... హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు క్షమాబిక్ష పెడితే... వీరి విడుదలకు అవకాశం ఉంటుంది.

దీంతో... 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని నేపాల్ వెళ్లి మృతుడు బహదూర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సమయంలో లాయర్లు, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించి.. ఈ సందర్భంగా వారికి ఆర్థికంగా రూ. 15 లక్షల ఆర్థికసాయం అందించారు. అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడి అధికారులతో సమీక్షించారు కేటీఆర్.

దీంతో దుబాయ్ కోర్టు ఈ ఐదుగురు తెలంగాణ బిడ్డలకూ క్షమాబిక్ష ప్రసాదించింది. దీంతో వీరిలో నలుగురు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా.. ఐదో వ్యక్తి వెంకటేశ్ వచ్చేనెలలో విడుదల కానున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇండియాకు వచ్చిన వారు కేటీఆర్ ప్రయత్నం వల్లనే తాము స్వదేశానికి చేరుకున్నామని భావోద్వేగాల మధ్య స్పష్టం చేశారు!