Begin typing your search above and press return to search.

పాక్ లో ట్విట్టర్ బ్యాన్... పెద్ద రీజనే చెబుతున్న ప్రభుత్వం!

ఈ నేపథ్యంలో... పాకిస్తాన్‌ లోని సింధ్ హైకోర్టు ఎక్స్ ప్లాట్‌ ఫారం సేవలను పునరుద్ధరించాలని టెలికాం అథారిటీని ఆదేశించింది.

By:  Tupaki Desk   |   18 April 2024 4:04 AM GMT
పాక్  లో ట్విట్టర్  బ్యాన్... పెద్ద రీజనే చెబుతున్న ప్రభుత్వం!
X

పాకిస్తాన్ లో సోషల్ మీడియా ప్లాట్‌ ఫారం ఎక్స్ (ట్విట్టర్)పై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం! భద్రతా సమస్యలను కారణంగా చూపించి ఫిబ్రవరిలోనే ఎక్స్ ని నిషేధించాలని ఆదేశించింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఎక్స్ కి సంబంధించిన సిబ్బంది కోర్టు మెట్లు ఎక్కింది. మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌ పై నిషేధాన్ని రద్దు చేయాలని యాజమాన్యం పాకిస్థాన్ సింధ్ హైకోర్టుని ఆశ్రయించింది.

దీంతో హైకోర్టు ఎక్స్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ లో ఎక్స్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుతున్న సమాచారం ప్రకారం... ఒక వారంలోగా నిషేధాన్ని ఎత్తివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందన్ని తెలుస్తుంది. అయినా కూడా పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు కదులుతుందని అంటున్నారు.

అవును... ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌ లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ ఫారంలను పాకిస్తాన్ ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఓటింగ్ రోజున పాకిస్థాన్‌ లో రోజంతా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అయితే ఎన్నికల తర్వాత చాలా సోషల్ మీడియా ప్లాట్‌ ఫారంలు మళ్లీ మునుపటిలా పనిచేయడం ప్రారంభించాయి. అయితే ఎక్స్ వినియోగదారులు మాత్రం తమ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయారు.

ఈ నేపథ్యంలో... పాకిస్తాన్‌ లోని సింధ్ హైకోర్టు ఎక్స్ ప్లాట్‌ ఫారం సేవలను పునరుద్ధరించాలని టెలికాం అథారిటీని ఆదేశించింది. అయినప్పటికీ ఎక్స్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించలేదు. ఈ క్రమంలో తాజాగా... ఎక్స్ దేశ భద్రతకు ముప్పు అని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా... జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడంలో ఎక్స్ విఫలమైందని పేర్కొంది. అందుకనే నిషేధం తప్పనిసరి అయిందని వెల్లడించింది.