'ట్విటర్ కిల్లర్'కు ఉరిశిక్ష.. అసలు ఎవరీ కిల్లర్.. ఏంటా కథ?
జపాన్‌లో సంచలనం సృష్టించిన "ట్విటర్ కిల్లర్" కేసులో ప్రధాన నిందితుడు తకహిరో షిరైషికి శుక్రవారం ఉరిశిక్ష అమలైంది.
By: Tupaki Desk | 27 Jun 2025 2:11 PM ISTజపాన్‌లో సంచలనం సృష్టించిన "ట్విటర్ కిల్లర్" కేసులో ప్రధాన నిందితుడు తకహిరో షిరైషికి శుక్రవారం ఉరిశిక్ష అమలైంది. 2017లో టోక్యోలోని తన అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన షిరైషి అప్పటి నుంచి జపాన్‌ను వణికించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జపాన్‌లో మళ్ళీ ఉరిశిక్షను అమలు చేయడం ఇదే.
- క్రైం చేశాడిలా..
2017లో టోక్యోలోని జామా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 8 మంది మహిళలు, ఓ పురుషుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆ ఫ్లాట్‌లో నివసిస్తున్న తకహిరో షిరైషిని అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగుచూశాయి. నిందితుడి మాటల ప్రకారం, ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్న వ్యక్తులను ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తించి, వారికి సహాయం చేస్తున్నట్లు నమ్మించి, తన వద్దకు రప్పించి హత్య చేసేవాడు. అతను చెప్పిన ప్రకారం "వారు చనిపోవాలనుకున్నారు. నేను సహాయం చేశాను." అని చెప్పాడు. అయితే విచారణలో అసలు దారుణం బయటపడింది. షిరైషి తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వారి శరీరాలను ముక్కలుగా నరికి బాక్సుల్లో దాచినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో టీనేజర్లు కూడా ఉండటం మరింత కలచివేసింది.
- 'ట్విటర్ కిల్లర్'గా ముద్ర
సామాజిక మాధ్యమాల ద్వారా బాధితులను ఆకర్షించిన తీరుతో అతడికి "ట్విటర్ కిల్లర్" అనే పేరుపడింది. జపాన్‌లో ఈ కేసు తీవ్రమైన చర్చకు దారి తీసింది. 2020లో అతడికి జపాన్ న్యాయవ్యవస్థ మరణశిక్ష విధించింది.
- మూడేళ్ల విరామం తర్వాత ఉరిశిక్ష
జపాన్‌లో ఇటీవల ఉరిశిక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ, 2024లో మళ్ళీ ఉరిశిక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని భాగంగా షిరైషికి శుక్రవారం టోక్యో డిటెన్షన్ హౌస్‌లో ఉరిశిక్ష అమలు చేశారు. అధికారులు ఈ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుని, ఉరిశిక్ష పూర్తయ్యేవరకు విషయం గోప్యంగా ఉంచారు.
- న్యాయం జరిగిందా?
ఈ కేసు జపాన్‌లో నేరశిక్షలపై పెద్ద చర్చను తెరపైకి తీసుకువచ్చింది. కొంతమంది ఉరిశిక్షను తగిన న్యాయంగా భావిస్తే, మరికొందరు దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తున్నారు. అయితే 'ట్విటర్ కిల్లర్' కేసులో జరిగిన పాశవికమైన హత్యలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపిన విషయం మాత్రం నిజం.
