Begin typing your search above and press return to search.

రీ పోస్ట్‌మార్టమా? లేక బాడీ తీసుకెళ్లాలా? గందరగోళంలో ట్విషా కుటుంబం

తెలుగు సినిమా ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫేమ్, మాజీ మిస్ పుణె ట్విషా శర్మ మరణం టాలీవుడ్‌తో పాటు ఉత్తరాదిలోనూ తీవ్ర సంచలనం రేపుతోంది.

By:  Madhu Reddy   |   21 May 2026 12:53 AM IST
రీ పోస్ట్‌మార్టమా? లేక బాడీ తీసుకెళ్లాలా? గందరగోళంలో ట్విషా కుటుంబం
X

తెలుగు సినిమా ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫేమ్, మాజీ మిస్ పుణె ట్విషా శర్మ మరణం టాలీవుడ్‌తో పాటు ఉత్తరాదిలోనూ తీవ్ర సంచలనం రేపుతోంది. వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే ఆమె అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతుండగా, మరోవైపు ఆమె మృతదేహం ఆసుపత్రి మార్చురీలోనే ఉండిపోవడం, అది కాస్తా కుళ్లిపోయే స్థితికి చేరడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర గందరగోళంలో మునిగిపోయారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..

నోయిడా నుంచి టాలీవుడ్ వరకు:

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ, 2012లో 'మిస్ పుణె'గా నిలిచింది. మోడలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో స్థిరపడాలని ప్రయత్నాలు చేసిన ఆమె, ఈ ప్రయాణంలో భాగంగా 2021లో విడుదలైన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే గ్లామర్ ఫీల్డ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది.

ప్రేమ వివాహం.. ఐదు నెలలకే నరకం:

ఇక అప్పుడే డేటింగ్ యాప్‌లో పరిచయమైన సమర్థ్‌ సింగ్ అనే లాయర్‌ను ట్విషా ప్రేమించింది. వీరిద్దరూ గతేడాది డిసెంబర్‌లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె జీవితం తలకిందులైంది. చనిపోవడానికి కొద్దిరోజుల ముందు తన తల్లికి మెసేజ్ చేస్తూ.. తాను తీవ్రమైన మానసిక క్షోభ, వేధింపులు అనుభవిస్తున్నానని, ఈ పెళ్లి బంధంలో చిక్కుకుపోయి జీవితం నరకంలా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.

మే 12న అనుమానాస్పద మృతి:

ఇక తల్లికి, స్నేహితులకు బాధాకరమైన మెసేజ్‌లు పంపిన కొద్దిరోజులకే.. అంటే ఈ నెల 12న భోపాల్‌లోని అత్తవారింట్లో ట్విషా ఉరివేసుకుని చనిపోయింది. కూతురి మృతిపై తల్లిదండ్రులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, కేసు తీవ్రతను బట్టి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు.

ఎయిమ్స్ మార్చురీలో కుళ్లిపోతున్న మృతదేహం:

కూతురి మృతికి కారణమైన వారికి శిక్ష పడాలని, తమకు న్యాయం జరగాలని ట్విషా కుటుంబం గత 8 రోజులుగా పోరాడుతోంది. అయితే, అప్పటినుంచి ఆమె మృతదేహం భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఉంది. సరైన వసతులు లేకపోవడంతో శవం క్రమంగా కుళ్లిపోతోంది. ఇక మృతదేహం పాడవకుండా ఉండాలంటే -80 డిగ్రీల టెంపరేచర్ అవసరం కాగా, అక్కడ కేవలం -4 డిగ్రీల వరకే సదుపాయం ఉంది.

తల్లిదండ్రుల సందిగ్ధత:

మృతదేహం పాడవుతుండటంతో ట్విషా తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఇక న్యాయం కోసం మృతదేహానికి 'రీపోస్ట్‌మార్టం' చేయించాలా? లేక బాడీ మరింత కుళ్లిపోకముందే ఆసుపత్రి నుంచి తీసుకుని వెళ్ళిపోయి అంత్యక్రియలు నిర్వహించాలా? అనే గందరగోళంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ కేసు ఆధారాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

గ్లామర్ ప్రపంచంలో మెరిసి, ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఒక యువతి ఇలా ఐదు నెలలకే విగతజీవిగా మారడం అత్యంత బాధాకరం. ఇక ఓ పక్క కూతురిని కోల్పోయిన పుట్టెడు దుఃఖం, మరోపక్క కుళ్లిపోతున్న శవాన్ని చూస్తూ ఏం చేయాలో తెలియని సందిగ్ధత.. ట్విషా కుటుంబ పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ కేసులో నిజానిజాలు త్వరగా తేలి, బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరగాలని ఆమె సన్నిహితులు కోరుతున్నారు.