కవలలను పెళ్లాడిన కవలలు.. నెల తిరిగేసరికి ఒకరు సూసైడ్
ఆ ఇద్దరు కవలలు. అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటారు. ఆ ఇద్దరు కవలల అన్నదమ్ములు.. తమ మాదిరే అచ్చుగుద్దినట్లుగా ఉండే అక్కాచెల్లెళ్లను పెళ్లాడారు.
By: Garuda Media | 21 March 2026 11:10 AM ISTఆ ఇద్దరు కవలలు. అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటారు. ఆ ఇద్దరు కవలల అన్నదమ్ములు.. తమ మాదిరే అచ్చుగుద్దినట్లుగా ఉండే అక్కాచెల్లెళ్లను పెళ్లాడారు. వీరి పెళ్లి ఫోటోలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి. అందరూ ఆసక్తిగా చూసినోళ్లే. ఆనందంగా అభినందించారు.వీరి పెళ్లై ఇంకా నెల కూడా కాలేదు. ఏమైందో ఏమో తెలీదు కాదు.. కవలలైన అన్నాతమ్ముళ్లలో ఒకరు తాజాగా సూసైడ్ చేసుకోవటం షాకింగ్ గా మారింది. పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. అసలేం జరిగిందంటే..
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన కవలలు వినయ్ కుమార్, విజయ్ లు చూసేందుకు ఒకేలా ఉంటారు. వీరి పోలికలు జిరాక్స్ కాపీలా ఉంటారు. వీరిలో 31 ఏళ్ల వినయ్ కుమార్ హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. ఇటీవల ట్విన్స్ డే రోజున ఈ ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. వీరికి సంబంధాలు వెతుకుతున్న సమయంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కీర్తన.. కీర్తి కవలల సోదరీమణుల గురించి తెలిసి.. పెద్దలు వీరి వివాహాన్ని డిసైడ్ చేశారు.
ఈ ఇద్దరికి ఆ ఇద్దరన్న మాటకు తగ్గట్లే.. రూపురేఖల్లోనే కాదు.. మైండ్ సెట్ లోనూ రెండు జంటల మధ్య చక్కటి అవగాహన ఏర్పడటంతో వీరికి పెద్దలు పెళ్లి డిసైడ్ చేశారు. ఒకే ముహుర్తానికి విజయ్ - కీర్తన, వినయ్ - కీర్తి పెళ్లి జరిగింది. ఉగాది రోజున ఇంటి నుంచి బయటకు వెళ్లిన వినయ్ కుమార్ తిరిగి రాలేదు. దీంతో అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు.
ఇంతకూ అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. కోరి పెళ్లి చేసుకున్న నెల కూడా కాకుండా ఆత్మహత్య చేసుకునేంత పెద్ద కష్టం ఏమొచ్చింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది. నెల క్రితం నవ్వుతూ.. తుళ్లుతూ పెళ్లి చేసుకున్న వినయ్ అలా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?అన్నది మిస్టరీగా మారింది.
