TVS కంపెనీ వేల కోట్ల సామ్రాజ్యం వెనక శక్తి?
నేడు మార్కెట్లో టీవీఎస్ మోటార్ సైకిల్స్ బ్రాండ్ ఏ రేంజులో పాపులరైందో తెలిసిందే.
By: Tupaki Desk | 29 April 2025 9:42 AM ISTనేడు మార్కెట్లో టీవీఎస్ మోటార్ సైకిల్స్ బ్రాండ్ ఏ రేంజులో పాపులరైందో తెలిసిందే. ఈ కంపెనీ ఇప్పుడు 25,000 కోట్లు పైగా టర్నోవర్ ని కలిగి ఉంది. అయితే ఒక సాధాసీదా బస్ గ్యారేజీ సర్వీస్ తో ప్రారంభమైన టివిఎస్ కంపెనీ ఇప్పుడు దేశ విదేశాల్లో తన వ్యాపర కార్యకలాపాలను విస్తరించింది. ఈ సందర్భంగా ఇంతటి విజయవంతమైన సంస్థకు కీలక ఫౌండర్ హెడ్ గురించి ఆరా తీస్తే తెలిసిన వివరాలు ఆసక్తిని కలిగించాయి.
ఆయన పూర్తి పేరు టి. వి. సుందరం అయ్యంగార్. చెన్నై స్వస్థలం. టి. వి. సుందరం అయ్యంగార్ 1911లో చిన్న బస్సు సర్వీసును ప్రారంభించే ముందు న్యాయవాదిగా, బ్యాంకర్‌గా తన కెరీర్ జర్నీ ప్రారంభించారు. గొప్ప వ్యాపార దక్షత, దార్శనికత, విలువలతో ఆ తర్వాత అతడు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. టి.వి.ఎస్ టూవీలర్ కంపెనీ దినదిన ప్రవర్థమానంగా ఎదిగింది. నేడు వేల కోట్ల సామ్రాజ్యంగా విస్తరించింది. ప్రస్తుతం అయ్యంగార్ వారసులు దీనిని నడిపిస్తున్నారు. వారసులు తరతరాల వ్యాపార వారసత్వాన్ని కాపాడుతూ ముందుకు సాగుతున్నారు.
కలలు కనండి.. నిజం చేసుకునేందుకు పని చేయండి! అనేది సూత్రం. సుందరం అయ్యంగారు గొప్ప కలలు కన్నారు. వాటిని నిజం చేసుకున్నారు. 22 మార్చి 1877న తమిళనాడులోని తిరుక్కురుంగుడిలో జన్మించిన ఆయన లా డిగ్రీలో పట్టా పొందాడు. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు. అయితే రొటీన్ గా జీవితం సాగడం అతడికి నచ్చదు. భారతీయ రైల్వేలలో పని చేసి తరువాత బ్యాంకింగ్ రంగంలో అవకాశాలను వెతికాడు. పరిపాలన, వ్యవస్థలపై అతడి అవగాహన తన పరిధిని విస్తరించేందుకు సహకరించింది. 1911లో సుందరం అయ్యంగార్ మధురైలో టీవీ సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇది అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. ఒక చిన్న బస్సులకు సర్వీస్ చేసే కంపెనీగా ఇది ప్రారంభమైనది. అత్యంత వేగంగా ఎదిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో మొట్టమొదటి ప్రజా బస్సు రవాణా సేవను ప్రవేశపెట్టిన వ్యక్తి గా అయ్యంగార్ చరిత్రకెక్కారు.
