దళపతి విజయ్ టీవీకే పార్టీ సింబల్స్.. ఆ రెండింటిపైనే చర్చ!
విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కజగం పార్టీ త్వరలో ఎన్నికల గుర్తుపై ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు చేసుకోనున్న నేపథ్యంలో.. పార్టీ ఎలక్షన్ సింబల్స్ పై చర్చ మొదలైందని తెలుస్తొంది.
By: Tupaki Desk | 22 May 2025 10:00 PM ISTవచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంతకాలం రెండు పార్టీలు / గ్రూపుల మధ్యే పోటీ అనుకున్న దశలో తమిళ సినీ దిగ్గజం, దళపతి విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో ఎంట్రీ ఇచ్చారు. దీంతో.. ఈ సారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ తప్పదనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో భారత ఎన్నికల సంఘం 190 ఉచిత్ర చిహ్నాల జాబితా నుంచి ఎలక్షన్ సింబల్ ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. వాస్తవానికి 2026 మే 6 నాటికి తమిళనాడు అసెంబ్లీ పదవీ కాలం ముగియనుండటంతో ఈ ఏడాది నవంబర్ 5న దరఖస్తు చేసుకోవడానికి విండో తెరవబడుతుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా రెండు సింబల్స్ పై టీవీకే ఆసక్తి చూపిస్తుందని తెలుస్తోంది.
అవును... విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కజగం పార్టీ త్వరలో ఎన్నికల గుర్తుపై ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు చేసుకోనున్న నేపథ్యంలో.. పార్టీ ఎలక్షన్ సింబల్స్ పై చర్చ మొదలైందని తెలుస్తొంది. ఈ సమయంలో.. క్రికెట్ బ్యాట్, విజిల్ లు అగ్ర ఎంపికలుగా ఉండగా.. వాటితో పాటు మైక్రోఫోన్ కూడా పార్టీ పరిశీలనలో ఉందని అంటున్నారు. దీని వెనుక బలమైన లాజిక్స్ ఉన్నాయని చెబుతున్నారు.
ఈ సందర్భంగా పార్టీకి ఎంచుకున్న ఎన్నికల గుర్తు... నిత్యం ప్రజల్లో ప్రతిధ్వనించాలని.. ఇదే సమయంలో విజయ్ ఫిల్మోగ్రఫీకి ఏదో విధంగా సంబంధించినదై ఉండేలా చూసుకోవాలని.. ఇప్పటికే ఉన్న గుర్తులతో ఏమాత్రం దగ్గర పోలికలు లేకుండా జాగ్రత్తపడాలని.. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు సులభంగా గుర్తు పెట్టుకునేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది!
ఇందులో ప్రధానంగా క్రికెట్ బ్యాట్ కు యువతలో విస్తృత ఆకర్షణ ఉండటంతో పాటు పూర్తి జనాదరణ పొందిన సంస్కృతితో సంబంధం కలిగి ఉందని అంటున్నారు. ఇదే సమయంలో విజయ్ సినిమా "బిగిల్"లో ప్రముఖంగా కనిపించిన విజిల్ కూడా ఈ జాబితాలో ఉందని చెబుతున్నారు. ఇక విజయ్ స్వరం ప్రజల్లోకి చేరడానికి అనుగుణంగా అన్నట్లుగా మైక్రోఫోన్ ను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.
నేపథ్యంలో అటు పార్టీ సీనియర్లు, యువ నాయకులతో పాటు విజయ్ ఈ ఎన్నికల గుర్తుపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారని చెబుతున్నారు! పైన చెప్పుకున్నట్లు క్రికెట్ బ్యాట్, విజిల్, మైక్రోఫోన్ తో పాటు ఉంగరం, వజ్రం వంటి వాటినీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
