బుల్లితెర నటిని కత్తితో పొడిచి పరారైన భర్త
దారుణ నేరాలకు.. ఘోరాలకే కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది కర్ణాటక రాష్ట్రం. ఇటీవల కాలంలో సంచలన నేరాలు ఎక్కువగా కర్ణాటకలో జరగటం గమనార్హం
By: Tupaki Desk | 12 July 2025 9:45 AM ISTదారుణ నేరాలకు.. ఘోరాలకే కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది కర్ణాటక రాష్ట్రం. ఇటీవల కాలంలో సంచలన నేరాలు ఎక్కువగా కర్ణాటకలో జరగటం గమనార్హం. తాజాగా అలాంటి మరో ఉదంతం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగలూరులో చోటు చేసుకుంది. సీరియల్ నటిగా పేరొందిన బుల్లితెర నటిపై భర్త చేసిన ఘాతుకమిది. షాకింగ్ అంశం ఏమంటే.. కత్తిపోట్లకు గురి చేసిన భర్త దాడి గురించి సదరు సీరియల్ నటి పోలీసులకు చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా చికిత్స తీసుకుంటే.. వైద్యుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేయటంతో ఈ విషయం వెలుగు చూసింది.
కన్నడ బుల్లితెర నటిగా శ్రుతి ఫేమస్. ఆమె పలు టీవీ సీరియళ్లలో నటించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆమె భర్త కత్తితో పలు చోట్ల పొడిచి పరారయ్యాడు. గాయాల బారిన పడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేనప్పటికి.. గాయాల తీవ్రత ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ఇరవై ఏళ్ల క్రితం నటి శ్రుతి ఆటో డ్రైవర్ అయిన అమరేశ్ ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు.
ఇటీవల కాలంలో వారి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. కట్నం కోసం భర్త వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మూడు నెలల క్రితం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం ఆమె కళ్లలోకి పెప్పర్ స్ప్రే చల్లిన అమరేశ్.. ఆమె తొడ.. పొత్తికడుపు తదితర ప్రదేశాల్లో కత్తితో పొడిచాడు. గాయాల బారిన పడిన ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.అయితే.. భర్త తనపై చేసిన దాడి గురించి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయలేదు. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు వెతుకుతున్నారు.
