11 వేల మంది భవితవ్యం ప్రశ్నార్థకం..సముద్రంలో కలిసిపోతున్న దేశం
ఆస్ట్రేలియా, హవాయి మధ్య పసిఫిక్ మహాసముద్రంలో దీర్ఘచతురస్రాకారంలో ఏర్పడిన ఈ దేశం గ్లోబల్ వార్మింగ్ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది
By: Tupaki Desk | 23 April 2025 1:00 AM ISTత్వరలోనే ప్రపంచపటం నుంచి ఓ దేశం కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. ఆ దేశమే 'తువాలు'. ఆస్ట్రేలియా, హవాయి మధ్య పసిఫిక్ మహాసముద్రంలో దీర్ఘచతురస్రాకారంలో ఏర్పడిన ఈ దేశం గ్లోబల్ వార్మింగ్ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. సముద్ర మట్టం పెరుగుదల కారణంగా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 40శాతం నీటిలో కలిసిపోయింది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరి నాటికి తువాలు పూర్తిగా సముద్రంలో మునిగిపోయి.. ప్రపంచంలో గ్లోబల్ వార్మింగుకు బలైన మొదటి దేశంగా చరిత్రలో నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కేవలం 10 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, దాదాపు 11,200 మంది జనాభాతో ఉన్న ఈ దేశం మనుగడ కోసం చివరగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే, ఏప్రిల్ 15న దేశ ప్రధాని ఇక్కడ మొట్టమొదటి ఏటీఎంను ప్రారంభించారు.
తువాలు సగటు ఎత్తు సముద్ర మట్టానికి కేవలం రెండు మీటర్లు మాత్రమే. అందువల్ల సముద్ర మట్టం స్వల్పంగా పెరిగినా అది దేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత 30ఏళ్లలో ఇక్కడ సముద్ర మట్టం 15 సెంటీమీటర్ల మేర పెరిగింది, ఇది ప్రపంచ సగటు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. నాసా అంచనాల ప్రకారం.. 2050 నాటికి రాజధాని ఫునాఫుటిలోని సగం భూభాగం ప్రతిరోజూ అధిక ఆటుపోట్ల సమయంలో నీటిలో మునిగిపోతుంది. ఇది దేశ జనాభాలో 60శాతం మంది నివసించే ప్రాంతం. ఉప్పునీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకురావడం వల్ల మంచి నీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు వర్షపు నీటిపై, ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన తోటలపై ఆధారపడుతున్నారు.
తువాలు తన ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆస్ట్రేలియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఏటా 280 మంది తువాలు పౌరులు ఆస్ట్రేలియాకు శాశ్వత నివాసం కోసం వెళ్లవచ్చు. సముద్రపు గోడలు, ఇతర రక్షణ చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా ఏడు హెక్టార్ల కృత్రిమ భూమిని కూడా సృష్టిస్తోంది. ఈ ప్రయత్నాలు పెరుగుతున్న సముద్ర మట్టానికి ఏమాత్రం సరిపోవడం లేదు. దేశం కనుమరుగవుతన్న సమయంలో తువాలు ప్రధాని మొదటి ఏటీఎంను ప్రారంభించడం ఒక విచిత్ర పరిణామం. నగదు లావాదేవీలపై పూర్తిగా ఆధారపడిన ఈ చిన్న దేశంలో ఏటీఎం అందుబాటులోకి రావడం కొంత మేర ఆర్థిక సౌలభ్యాన్ని అందించవచ్చు. అయితే, ఇది తువాలు ప్రధాన సమస్య అయిన గ్లోబల్ వార్మింగ్, సముద్ర మట్టం పెరుగుదలకు పరిష్కారం కాదు. ఇది కేవలం అంతరించిపోతున్న దేశంలో మిగిలిన భూమిలో సాధారణ జీవితాన్ని కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నంగా పరిగణించవచ్చు.
